రేవంత్ రెడ్డిని వెంటాడుతున్న ప్రమాదాలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరోసారి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని టిజి 09 ఆర్‌ఆర్ 0009 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్ వాహనం టైరు ఒక్కసారిగా పేలింది. సిఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ నుంచి కొడంగల్ వెళ్తుండగా మార్గమధ్యలో సిఎం కాన్వాయ్‌లోని ఓ కారు టైర్ ఒక్కసారిగా పేలిపోయింది. 
 
ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ అప్రమత్తతతో పెనుప్రమాదం తప్పింది. దీంతో సిఎం, భద్రతా సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. వెంటనే ఆ టైరును రిపేరు చేయడానికి స్థానికంగా ఉన్న మెకానిక్‌ను సిబ్బంది పిలిపించారు. ఈ ఘటన జరిగాక ఈ ఒక్క కారు తప్ప మిగిలిన వాహనాలతో రేవంత్ కొడంగల్‌కు బయలుదేరి వెళ్లారు.
 
వికారాబాద్ జిల్లా మన్నెగూడ వద్ద ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనతో అందరూ భయాందోళనకు గురికాగా.. అక్కడ ఏం జరుగుతుందో కొద్దిసేపు అర్థం కాక అంతా షాక్‌లో ఉండిపోయారు. ఈ క్రమంలోనే సెక్యూరిటీ సిబ్బంది కారు టైరు పేలిందని గుర్తించారు. గత నెలరోజులలో రేవంత్ రెడ్డి తప్పించుకొని బైటపడిన మూడో ప్రమాదం ఇది కావడం గమనార్హం.
 
గత నెలలో సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. మార్చి 17 వ తేదీన సీఎం రేవంత్ రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షీ ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం ఏర్పడింది. దాన్ని సమయానికి గుర్తించిన పైలట్లు వెంటనే ల్యాండింగ్ చేయడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
 
ఇక మార్చి 4 వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లో ప్రమాదం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం తిమ్మాపూర్ వద్ద వేగంగా వెళ్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్‌లో ఒకదానికొకటి 6 కార్లు ఢీకొన్నాయి. అయితే కార్లలోని ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ క్రమంలోనే నెల రోజుల వ్యవధిలోనే 3 సార్లు ఇలాంటి ప్రమాదాలు సీఎం రేవంత్ రెడ్డికి ఎదురయ్యాయి.