మెట్రో కార్డులపై రాయితీలు ఆరు నెలలు పొడిగింపు

ప్రయాణికులకు మార్చి 31తో ముగిసిన మెట్రో రైలు రాయితీలను పొడిగించే ప్రసక్తి లేదని ప్రకటించిన హైదరాబాద్ మెట్రో ప్రజల నుండి నిరసనలు వ్యక్తం కావడంతో మళ్లీ పొడిగిస్తున్నట్లు మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి ప్రకటించారు. గత ఏడాది కూడా ఎక్కువగా రద్దీగా ఉండే వేసవికాలంలో ఇటువంటి రాయితీలను ఉపసంహరించుకున్న మెట్రో రైలు ప్రస్తుతం  లోక్ సభ ఎన్నికల సమయం కావడంతో వెనుకడుగు వేసిన్నట్లు తెలుస్తున్నది. 
 
ఉగాది సందర్భంగా మెట్రో స్టూడెంట్ పాస్, సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డు, సూపర్‌ ఆఫ్ పీక్‌ అవర్‌ ఆఫర్లను ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు తెలిపారు. సూపర్ సేవర్ మెట్రో హాలిడే కార్డుతో సెలవు రోజుల్లో రూ.59కే ప్రయాణం చేసే సదుపాయం మెట్రో కల్పిస్తుంది. రద్దీ లేని సమయాల్లో ప్రయాణ ఛార్జీల్లో 10 శాతం రాయితీ ఇస్తూ సూపర్‌ ఆఫ్‌ పీక్‌ అవర్‌ ఆఫర్ అందిస్తుంది. విద్యార్థుల కోసం మెట్రో స్టూడెంట్‌ పాస్‌లను అమలుచేస్తుంది.
 
వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రద్దీ పెరిగింది. మెట్రో మూడు మార్గాల్లో ప్రతి రోజు దాదాపుగా 5 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. పనిరోజుల్లో మెట్రోలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారాంతంలో కాస్త తక్కువగా ఉంటుంది. అయితే, ఆర్టీసీ మహిళల ఉచిత ప్రయాణం పథకాన్ని అమలుచేసిన తర్వాత మెట్రో రైలులో మహిళ ప్రయాణికుల సంఖ్య తగ్గింది. అయితే, ఎండలు తీవ్రత పెరుగుతుండడంతో మెట్రోలో రద్దీ పెరుగుతోందని నిర్వాహకులు అంటున్నారు.