నకిలీ పాఠ్యపుస్తకాలపై ఎన్‌సిఇఆర్‌టి హెచ్చరిక

తమ సిలబస్‌కు చెందిన నకిలీ పాఠ్యపుస్తకాల తయారుచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ అండ్ ట్రెయినింగ్ (ఎన్‌సిఇఆర్‌టి) హెచ్చరించింది. ఇలాంటి నకిలీ పాఠ్యపుస్తకాల వల్ల తప్పుడు సమాచారం వ్యప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

 తమ పాఠ్యపుస్తకాలను చట్టవిరుద్ధంగా ముద్రించడం, వాటిని వాణిజ్యపరంగా విక్రయించడం కాపీరైట్ ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని ఎన్‌సిఇఆర్‌టి హెచ్చరించింది. తమ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలను కొందరు పబ్లిషర్లు ఎటువంటి అనుమతి లేకుండా ముద్రిస్తున్నారని తెలిపింది. 

ఎన్‌సిఇఆర్‌టి పాఠ్యపుస్తకాలను పూర్తిగా కాని వాటిలో కొన్ని భాగాలను కాని ఎటువంటి అనుమతి లేకుండా ముద్రించి, వాటిని ఇతర పాఠశాలలకు విక్రయించిన పక్షంలో కాపీరైట్ చట్టం ప్రకారం అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎన్‌సిఇఆర్‌టి హెచ్చరించింది. 

తప్పుడు సమాచారం ఉండే అవకాశం ఉన్న నకిటీ పాఠ్యపుస్తకాలు, వర్క్‌బుక్స్‌పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సిఇఆర్‌టి కోరింది. అటువంటివి తమ దృష్టికి వస్తే వెంటనే ఎన్‌సిఇఆర్‌టి సమాచారం అందచేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది.