ఆదిత్య ఎల్‌1కు చిక్కని అద్భుత సూర్యగ్రహణం

సూర్యుడి అధ్య‌య‌నం కోసం ఇస్రో ఆదిత్య ఎల్‌1ను ప్ర‌యోగించిన విష‌యం తెలిసిందే. అయితే లాంగ‌రిన్ 1 పాయింట్ వ‌ద్ద ఉన్న ఆదిత్య ఎల్‌1 అబ్జ‌ర్వేట‌రీకి సోమవారం చోటుచేసుకునే అద్భుత సంపూర్ణ సూర్యగ్రహణం చిక్కే అవకాశం లేదని చెబుతున్నారు. ఉత్త‌ర అమెరికా, మెక్సికో, కెన‌డా దేశాల్లో ఇవాళ సూర్య‌గ్ర‌హ‌ణం ఉన్న‌ది. 
 
ఆ అద్భుతాన్ని వీక్షించేందుకు అమెరికా కొన్ని ప్ర‌త్యేక విమానాల‌ను కూడా ఏర్పాటు చేశారు. న్యూయార్క్ రాష్ట్రంలో దాదాపు శ‌తాబ్ధ కాలం త‌ర్వాత పూర్తి స్థాయిలో గ్ర‌హ‌ణం క‌నిపించ‌నున్న‌ది. గ్ర‌హ‌ణాన్నిఅధ్యయనం చేసేందుకు నాసా కొన్ని ప్ర‌త్యేక ప్ర‌యోగాలు చేప‌ట్టింది.  మ‌రో వైపు సూర్యుడి అధ్య‌య‌నం కోసం నింగికి వెళ్లిన ఆదిత్య ఎల్‌1 శాటిలైట్ మాత్రం ఆ ఖ‌గోళ అద్భుతాన్ని అధ్యయనం చేయ‌డం లేదు. 
 
ఎందుకంటే ఆ శాటిలైట్‌ను ఉంచిన ప్ర‌దేశం నుంచి సూర్యుడిని 365 రోజులు చూడ‌వ‌చ్చు. 24 గంట‌లు చూసే రీతిలో ఆ శాటిలైట్‌ను ఎల్‌1 పాయింట్ వ‌ద్ద నిలిపారు. గ్ర‌హ‌ణం వ‌ల్ల శాటిలైట్ త‌న వ్యూవ్‌ను కోల్పోకుండా ఉండే రీతిలో ఆదిత్య‌ను ఉంచారు. చంద్రుడి వెనుక ఆదిత్య ఎల్‌1 స్పేస్‌క్రాఫ్ట్ ఉన్న కార‌ణంగా లాగ్‌రేంజ్ పాయింట్ 1 నుంచి ఆ గ్ర‌హ‌ణాన్ని చూడ‌లేమ‌ని ఇస్రో చైర్మెన్ ఎస్ సోమ‌నాథ్ తెలిపారు.భూమికి 15 ల‌క్ష‌ల కిలోమీట‌ర్ల దూరంలో ఆదిత్య స్పేస్‌క్రాఫ్ట్ ఉన్న‌ది. దాన్ని హాలో ఆర్బిట్‌లో ఉంచారు. అయితే ఆ పాయింట్ నుంచి సూర్యుడిని చూస్తున్న‌ప్పుడు శాటిలైట్‌కు ఎటువంటి అవ‌రోధాలు ఉండ‌వు. దీని వ‌ల్ల సౌర అధ్య‌య‌నం సులువు అవుతుంద‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు. 

ఆదిత్య ఎల్‌1లో ఉన్న విజిబుల్ ఎమిష‌న్ లైన్ క‌రోనాగ్రాఫ్ ప‌రిక‌రంతో కృత్రిమ గ్ర‌హణాన్ని ఏర్పాటు చేసి, దాన్ని అధ్య‌య‌నం చేసే స‌త్తా ఆ ప‌రిక‌రానికి ఉన్న‌ట్లు సోమ‌నాథ్ తెలిపారు. గ్ర‌హ‌ణం వ‌ల్ల సూర్యుడిలో ఎటువంటి మార్పులు ఉండ‌వ‌ని ఆదిత్య ఎల్ 1 శాటిలైట్ ప్రాజెక్టు డైరెక్ట‌ర్ నిగ‌ర్ షాజీ తెలిపారు. టెక్సాస్‌లో నిర్వ‌హించే ప‌రీక్ష‌లు, ఆ త‌ర్వాత ఆదిత్య ఎల్‌1 డేటాను స్ట‌డీ చేయ‌నున్న‌ట్లు ఖ‌గోళ శాస్త్ర‌వేత్త దీపాంక‌ర్ బెన‌ర్జీ తెలిపారు.