సందేశ్ ఖాళీ అల్లర్లపై సిబిఐ విచారణకు హైకోర్టు ఆదేశం

దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన సృష్టించిన పశ్చిమ బెంగాల్ లోని సందేశ్‌ఖాలీ అల్లర్లపై కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అక్కడ మహిళలపై జరిగిన లైంగిక నేరాలు, భూకబ్జా ఆరోపణలపై సీబీఐ విచారణకు ఆదేశించింది. సీబీఐ విచారణను కలకత్తా హైకోర్టు పర్యవేక్షిస్తుందని పేర్కొంది. 

రెవెన్యూ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి, వ్యవసాయ భూముల అక్రమ కబ్జాలపై సమగ్ర నివేదిక సమర్పించాలని కలకత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీఎస్‌ శివజ్ఞానం నేతృత్వంలోని డివిజన్‌ బెంచ్‌ సీబీఐని ఆదేశించింది. మే 2న జరిగిన అల్లర్ల కేసుపై నివేదిక సమర్పించాలని సీబీఐను కలకత్తా హైకోర్టు కోరింది. అదే రోజు ఈ కేసును మళ్లీ విచారిస్తామని పేర్కొంది.

ఈ విషయంపై న్యాయవాది అలోక్ శ్రీవాస్తవ్ స్పందించారు. హైకోర్టు ఈ రోజు ఒక చారిత్రక ఉత్తర్వులను జారీ చేసిందని హర్షం వ్యక్తం చేశారు. సీబీఐ అధికారులకు, సందేశ్ఖాలీ బాధితులకు తగిన సౌకర్యాలు, రక్షణ కల్పించాలని బంగాల్ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశింది. బాధితులకు అనుకూలంగా వరుస ఆదేశాలు కోర్టు జారీ చేస్తుంది.’ అని అలోక్ తెలిపారు.

 కాగా, అల్లర్లపై టీఎంసీ, బీజేపీ సర్కార్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. లోక్ సభ ఎన్నికల వేళ ప్రచారంలో బీజేపీ అల్లర్లను ప్రధానంగా ప్రస్తావించి టీఎంసీని ఇరకాటంలో పెడుతోంది. బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలోని సందేశ్ఖాలీలో అధికార తృణమూల్ కాంగ్రెస్ నేత షాజహాన్ షేక్, అతడి అనుచరులు అకృత్యాలకు పాల్పడుతున్నారని స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు. 

భూములు కబ్జా చేయడమే కాకుండా, మహిళలను బంధించి లైంగికంగా హింసించారని అంటున్నారు. దీనిపై ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసు యంత్రాంగం కూడా అతడికే అనుకూలంగా వ్యవహరించినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ అంశాన్ని కోల్‌కతా హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటనపై మీడియాలో కథనాలు తమను వేదనకు గురిచేశాయని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 

దీనిపై ఉత్తర 24 పరగణాల జిల్లా కలెక్టర్‌కు నోటీసులు జారీ చేసింది. రేషన్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ నివాసాన్ని తనిఖీ చేసేందుకు ఈడీ అధికారులు జనవరి 5న సందేశ్ఖాలీకి వెళ్లారు. ఆ సమయంలో షాజహాన్ అనుచరులు ఈడీ అధికారులపై దాడి చేశారు. ఈ ఘటన అనంతరం షాజహాన్ షేక్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.