ఓటింగ్‌శాతం పెంచేందుకు ఈసీ సోషల్‌ మీడియా ప్రచారం

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమిషన్‌ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. అదే సమయంలో ఓటింగ్‌ శాతాన్ని పెంపుపై దృష్టి సారిస్తున్నది. ఇందుకోసం ఎన్నికల సంఘం సోషల్‌ మీడియాలో విభిన్నంగా ప్రచారం చేస్తున్నది. లోక్‌సభ ఎన్నికల్లో ఓటు వేయడానికి యువ, పట్టణ ఓటర్లను ప్రోత్సహించేందుకు ‘ఆప్‌ ఏక్‌ హై’ క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది.

సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జరుగున్న విషయం తెలిసిందే. తొలి విడత ఈ నెల 19న మొదలుకానుండగా.. చివరి దశ పోలింగ్‌ జూన్‌ 1న ఉంటుంది. ఎన్నికల ఫలితాలను జూన్‌ 4న ప్రకటించనున్నది. ఈ క్రమంలో ఎన్నికల సంఘం యువ ఓటర్లను ఓటు వేసేలా ప్రోత్సహిస్తున్నది. 

18 సంవత్సరాలు నిండిన యువత ఓటు వేసేందుకు పోలింగ్‌ కేంద్రాలకు రావాలని పిలుపునిచ్చింది. ‘ఆప్ ఏక్ హై’ క్యాంపెయిన్‌లో భాగంగా ఓటింగ్‌ యంత్రాంగంతో సహా ఎన్నికల ప్రక్రియ ప్రాధాన్యాన్ని వివరించే ప్రయత్నం చేసింది.

అదే సమయంలో సామాజిక మాధ్యామాల్లో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు ఎన్నికల సంఘం ‘వెరిఫై బిఫోర్‌ యు యాంప్లిఫై’ కార్యక్రమానికి సైతం శ్రీకారం చుట్టింది. తప్పుడు సమాచార వ్యాప్తిని అడ్డుకోవడమే ఈ ప్రచారం లక్ష్యమని చీఫ్‌ సెలక్షన్‌ కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

 సోషల్ మీడియాలో సమాచారాన్ని పంచుకునే ముందు ఖచ్చితత్వం, ప్రామాణికతను ధ్రువీకరించేందుకు ఓటర్లను శక్తివంతం చేయడం.. తద్వారా తప్పుడు సమాచారం వ్యాప్తిని తగ్గించడం.. ఎన్నికల ప్రక్రియ సమగ్రతను కాపాడడం తమ లక్ష్యమని ఎన్నికల సంఘం పేర్కొంది.