కచ్చతీవును 1974లో శ్రీలంకకు వదులుకోవడంపై డిఎంకె, కాంగ్రెస్ వివరణ ఇవ్వాలని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఈ అంశంపై అవి ‘తమ కళంకాన్ని తొలగించుకోవాలి’ అని కూడా ఆయన కోరారు. ప్రధాని నరేంద్ర మోదీని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ విమర్శించడం పట్ల ఠాకూర్ ఆక్షేపణ తెలియజేస్తూ, రాష్ట్రానికి మోదీ వస్తారంటే స్టాలిన్ ఎందుకు ‘వణుకుతున్నారు’ అని ప్రశ్నించారు.
ఠాకూర్ చెన్నైలో విలేకరులతో మాట్లాడుతూ, ఒక వైపు ప్రధాని మోదీ మత్సకారులకు సబ్సిడీలు, విధానాలు, కార్యక్రమాలు సహా ఎన్నో ఇస్తుంటే మరొక వైపు డిఎంకె, కాంగ్రెస్ కచ్చతీవును శ్రీలంకకు ఇచ్చివేశాయని ఎద్దేవా చేశారు. .‘అవి బాహాటంగా దీనికి స్పందించాలి. కచ్చతీవును లంకకు ఇవ్వడానికి ఎవరు బాధ్యులు? డిఎంకె, కాంగ్రెస్ దీనిపై ఎందుకు మౌనం దాల్చాయి?” అంటూ నిలదీశారు.
ముఖ్యమైన భూభాగాన్నిఅవి ఎందుకు శ్రీలంకకు ఇచ్చివేసి, జాలర్లు, తమిళుల మనోభావాలను గాయపరిచాయని అనురాగ్ ఠాకూర్ విమర్శించారు. మోదీపై ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమిళనాడుకు మోదీ వస్తున్నారంటే ఆయన ఎంత ఇబ్బంది పడుతున్నారో సూచిస్తున్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.
‘ఆయన ఎందుకు వణుకుతున్నారు? తమిళనాడును, దాని ఘన సంస్కృతిని, సాంప్రదాయక చరిత్రను ప్రేమించే ప్రధానిని తమిళనాడు ప్రజలు అభిమానిస్తున్నందున ఆయన పర్యటనకు స్టాలిన్ ఆనందించాలి’ అని ఠాకూర్ హితవు చెప్పారు.
దేశవ్యాప్తంగా ప్రజల స్పందనను బట్టి బిజెపి ఈసారి 400 పైచిలుకు సీట్లను సులభంగా గెలుస్తుందని ఠాకూర్ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ‘భారత్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కావడానికి వీలుగా మోదీ వరుసగా మూడవ పర్యాయం ప్రధాని పదవి అధష్ఠించాలని జనం కోరుకుంటున్నారు’ అని ఠాకూర్ చెప్పారు.
More Stories
ఐక్యత, సమానత్వం అసాధారణ సంగమంగా మహాకుంభ మేళా
రైతులతో 14న చర్చలకు కేంద్రం సిద్ధం.. చికిత్సకు జగ్జీత్ సింగ్ అంగీకారం
సైఫ్ అలీఖాన్పై దాడి చేసిన బంగ్లాదేశ్ వాసి అరెస్ట్!