దార్శనికులు  డాక్టర్ హెడ్గేవార్

రాంపల్లి మల్లిఖార్జునరావు,                                                                                                                                                                     * జన్మదిన సంస్మరణ

సంఘ్ ప్రారంభంలో మౌలిక అంశాలు- 1

తెలంగాణా  ప్రాంతంలో ఇందూరు జిల్లాలో గోదావరి,  మంజీరా,  హరిద్ర నదుల సంగమ స్థానం కందకుర్తి గ్రామం. నైజాం పాలనలో ఎదుర్కొంటున్న కష్టాల నుండి బయటపడటానికి   ఆ గ్రామం నుండి  శతాబ్దాలకు పూర్వం వేద అధ్యయనము, శాస్త్ర అధ్యయనం వృత్తిగా గలిగిన నరహరి శాస్త్రి కుటుంబం  నాగపూర్ కి వెళ్ళిపోయింది.   ఆ వంశంలోని  బలిరాం పంత్ కుమారుడే హిందూ సమాజ సంఘటన కోసం తన జీవితాన్ని సమర్పించుకున్న  డాక్టర్ కేశవరావు.

డాక్టర్ జీ 1889 సంవత్సరం ఏప్రిల్ ఒకటో తేదీ ఉగాది పండుగ రోజున జన్మించారు.ఈ ఉగాది (క్రోధీ నామ సంవత్సరం)కి వారు జన్మించి 135   సంవత్సరాలు అవుతున్నది.  135 సంవత్సరాలకు పూర్వం జన్మించిన డాక్టర్ జీ హిందూ సమాజ పునర్నిర్మాణానికి చేసిన ఆలోచనలు ఆచరణలు ఈ రోజుకి ఆచరణీయం.

డాక్టర్ జీ  రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘాన్ని ప్రారంభించటానికి ముందు దేశంలో చోటు చేసుకొన్న  పరిస్థితులు, ఆంగ్లేయులు చేస్తున్న దుష్ప్రచారాలు దేశ ప్రజల ఆలోచనలలో  వస్తున్న మార్పులు ఇట్లా అనేక విషయాలను డాక్టర్ జి విశేష అధ్యయనం  చేసారు. దాని ఫల స్వరూపము 1925లో సంఘ ప్రారంభం. అట్లా  సమాజ హితం అనే గీటురాయి మీద పనిచేసిన డాక్టర్ జి  విశిష్టత తెలుసుకోవాలంటే  స్వాతంత్ర పూర్వ రంగాన్ని కొంత మనం   అర్థం చేసుకోవాలి.ఆ వివరాలు డాక్టర్జీ 135 వ జయంతి సందర్భంగా స్మరించు కొందాం.

నాటి దేశ సమకాలీన పరిస్థితులు

1857  స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఒక ప్రక్క ఆంగ్లేయులు,  మరో ప్రక్క భారతీయ మేధావులు ఆలోచనలో పడ్డారు.  ఆంగ్లేయులు 1857 నాటి పరిస్థితులు తిరిగి రాకుండా  తమ పాలనను కొనసాగించేందుకు   ఏం చేయాలి అని ఆలోచించి,  ఆలోచించి రెండు అభూత కల్పనలను ఈ దేశం మీదకి వదిలారు.   1. భారత్  ఒక ఉపఖండము, ఇది   ఒక దేశం కాదు,  ఒక జాతి కాదు  2. ఆ సిద్ధాంతానికి బలం చేకూర్చటంకోసం  ఆర్య ద్రావిడ  సిద్ధాంతం సృష్టించారు.

ఆ సిద్ధాంతం మూల సూత్రం ‘’ఈ దేశం ఎవ్వరిదీ  కాదు అందరూ బయట నుండి వచ్చిన వారే. ఈ దేశం  మీద మొదట  ఆర్యులు దండయాత్ర చేసారు.  ఆ తరువాత  దాడుల పరంపర కొనసాగింది, అంటే    ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు బయట నుంచి వచ్చిన వారే  అని సూత్రీకరించారు.  దాని ప్రభావం ఈ దేశంలోని  మేధావులుపై  పడటం ప్రారంభమైంది. దాని పర్యవసానం  ఈ దేశంకు  ఎవరెవరు ఏ కారణాల వల్లవచ్చారో  వారందరు ఇక్కడి  జాతీయులే నని  విశ్వసిస్తూ ఉండేవారు. దాని ప్రభావం ఈ దేశపు స్వతంత్ర పోరాటం మీద పడింది.

అయినా ఆ సమయంలో దేశంలో వ్యక్తులు, సమూహాలు, సంస్థల రూపంలో అనేక రంగాలలో పనులు మొదలైనాయి. ఆ ప్రయత్నాలలో భాగంగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. వాటిలో జాతీయ స్థాయిలో పనిచేసిన ఏడు  సంస్థల నేపథ్యం రేఖా మాత్రంగా  తెలుసుకొనే ప్రయత్నం చేద్దాము.

  1. 1857 స్వాతంత్ర సంగ్రామం ముగిసిన తరువాత 18 సంవత్సరాలకు అంటే 1875 ఏప్రిల్ 19న ముంబైలో దయానంద సరస్వతి ఆర్యసమాజ్ ప్రారంభించారు. తద్వారా వేద  విద్యను సామాన్య ప్రజల దగ్గరకు తీసుకొని వెళ్లారు. అట్లాగే శతాబ్దాలుగా ఒకే మార్గంలో సాగుతున్న మతం మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు శుద్ధికార్యక్రమం ద్వారా పునరాగమనం కు తెరలేపారు
  2. 1875 నవంబర్ 7న స్వాతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేపిన  వందేమాతర గీతం బంకించంద్ర చే  ఆవిష్కృతమైంది.  అది స్వాతంత్ర పోరాటానికి ఒక చోదక శక్తి.
  3. 1875 తదుపరి 10 సంవత్సరాలకు అంటే 1885 డిసెంబర్ 28న ఢిల్లీలో కాంగ్రెస్ వేదిక ప్రారంభమైంది.  1920 వరకు స్వాతంత్ర పోరాటం చేయడానికి కాంగ్రెస్ ఒక వేదికగా ఉండేది,  1920 నుండి క్రమంగా అది రాజకీయ పార్టీగా అవతరించడం  ప్రారంభమైంది.  గాంధీజీ నాయకత్వంలో ఒక రాజకీయ శక్తిగా మారింది.
  4. 1893 సెప్టెంబర్ 11 నుండి 27 వరకు అమెరికా లోని చికాగోలో  జరిగిన ప్రపంచ మత మహాసమ్మేళనంలో పాల్గొన్న స్వామి వివేకానంద భారత్ కు తిరిగి వచ్చిన తరువాత   కొలంబో నుండి అల్మొరా వరకు   దేశమంతా తిరిగారు. ఆ తదుపరి  1897 మే 1న వివేకానందుడు కలకత్తాలో రామకృష్ణ మిషన్ ను ప్రారంభించారు.
  5. ఆంగ్లేయుల ప్రోద్బలంతో ముస్లింలు తమ ప్రత్యేక అస్తిత్వం కోసం ఆలోచించటం ప్రారంభించారు దాని పర్యవసానం1906 డిసెంబర్ 30న ఢాకాలో  ముస్లిం లీగ్   ప్రారంభమైంది. 1947 ఆగస్టు 14 న పాకిస్తాన్ ప్రత్యేక ముస్లిం దేశం సాధించు కొన్నతరువాత   19 47 డిసెంబర్ 15నముస్లింలీగ్  రద్దు చేయబడింది.
  6. 1915లో మదన్మోహన్ మాలవీయా హిందూ మహాసభ ను ఢిల్లీ కేంద్రంగా  ప్రారంభించారు. హిందూ మహాసభ ప్రారంభంలో  కాంగ్రెస్ వైదికగానే పనిచేస్తూ చేస్తూ 1930లో ఆ వేదికనుండి బయటకు వచ్చి   హిందూ జాతీయ రాజకీయ పార్టీగ అవతరించింది. స్వతంత్ర వీర సావర్కర్ ఆ రాజకీయ పార్టీని నడిపించారు.
  7. అక్టోబర్ 1917 కమ్యూనిస్టు విప్లవంతో రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. ఆ విప్లవం ప్రేరణగా భారత్ లో  కమ్యూనిస్టు పార్టీ 1920లో ప్రారంభమై 1925 డిసెంబర్ 26న కాన్పూర్ లో ఒక జాతీయ పార్టీగా అవతరించింది

సంఘ ప్రారంభము

డాక్టర్జీ   సంఘాన్ని ప్రారంభించడానికి ముందు దేశంలో ఉన్న పరిస్థితులు, ఆ సమయంలో జాతీయ స్థాయిలో పనిచేస్తున్న  ధార్మిక సంస్థలు ,సామాజిక సమస్థలు,  రాజకీయ సంస్థలు వాటి కార్యకలాపాల  అన్నిటిని కూడా డాక్టర్ జి చాలా దగ్గరగా పరిశీలించారు. ఆ అనుభవాలతో  డాక్టర్జీ సంఘాన్ని ప్రారంభించారు.

1920 నుండి బ్రిటిష్ ప్రభుత్వం కొన్ని పరిమితులతో  ఎన్నికల ప్రక్రియ ప్రారంభించారు. దానితో  దేశంలో వివిధ ప్రాంతాలలో రాజకీయ పార్టీలు ప్రారంభమైనయి. కానీ  దేశానికి సంబంధించిన ఒక క్రొత్త  సామాజిక సంస్థ కూడా  ప్రారంభం కాలేదు.  స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా  పుట్టగొడుగుల్లాగా రాజకీయ పార్టీలు ప్రారంభమైనాయి.  అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో అనేక మంది స్వామీజీలు,  మాతాజీలు వివిధ సంస్థలను ప్రారంభించి దేశంలో ప్రపంచంలో ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పెంచేందుకు ప్రయత్నం చేశారు.

కానీ డాక్టర్ జి లాగా సమాజానికి  సంబంధించిన అన్ని విషయాలను సమగ్రంగా  ఆలోచించి పని చేయగలిగేటువంటి ఒక శక్తివంతమైన వ్యవస్థ ప్రారంభం కాలేదు.  అదే  డాక్టర్జీ   గొప్పతనం.  డాక్టర్జీకి  స్ఫూర్తినిచ్చిన గ్రంథాలు రెండు 1. తిలక్  వ్రాసిన గీతా రహస్యం.   అది నిష్కామ కర్మకు ప్రతీక . 2.  దాసబోధ సమర్థ రామదాస  స్వామిసమాజ సంఘటనకు పని ఎట్లా చేయాలి? కార్యకర్తలు ఎటువంటి గుణగణాలు ఉండాలి? మొదలైన విషయాలు దానిలో ఉన్నాయి.   సమర్థ రామదాస  స్వామి తన జీవన సర్వస్వాన్ని స్వధర్మాన్ని రక్షించడానికి పనిచేశారు. అట్లా డాక్టర్జీ తిలక్, సమర్ధ రామదాసస్వామీల స్ఫూర్తితో సంఘ కార్యాన్ని వికసింపచేశారు.

సంఘ పని స్పష్టతకు – డాక్టర్జీ మాటలు

రాష్ట్రీయ స్వయంసేవక సంఘం పని స్పస్టత కోసం  డాక్టర్ జి  నాలుగు విషయాలను చాలా ప్రధానంగా చెప్పారు. 1. ఇది హిందూ రాష్ట్రం 2. మనం హిందువులం 3. హిందూ సమాజ సంఘటన నిర్మాణం చేయాలి, దానికి వ్యక్తి నిర్మాణం ప్రధానం 4. హిందూ సమాజ సంఘటనతో ఈ దేశం పరమ వైభవ స్థితికి తీసుకొని వెళ్ళాలి.   అందుకే సంఘంలో శాఖ పద్ధతి ప్రారంభించారు.

  1. శాఖా  నిర్వహణకు సంబంధించిన ఆచార విభాగం, ఆజ్ఞలు,  ప్రార్థన,  ప్రతిజ్ఞ ఇవన్నీ కూడా సంస్కృత భాషలోనే ఉన్నాయి. ఎందుకంటే  ఈ దేశాన్ని కలిపిఉంచే   ఏకైక భాష సంస్కృతం.  ఆ విషయాన్ని చెప్పకనే డాక్టర్జీ మనకు అర్ధం చేయించారు ,
  2. అట్లాగే ఈ దేశానికి రాష్ట్ర ధ్వజం  భగవాధ్వజం.   ఆ విషయాన్ని గుర్తింపు చేయడానికి సంఘానికి గురువు   భగవద్వజంగా  ప్రకటించారు.  ప్రతిరోజు శాఖలో దేశమంతా కొన్ని వేల ప్రదేశాలలో ఈ భగవా ధ్వజాన్ని  ఎగరవేసి అద్వజం ముందు  ప్రార్థన చేయటం అనేది మనకి కనపడుతూ ఉంటుంది.

1938లో సంఘ శిక్ష వర్గ  పూర్తి అయిన తర్వాత ”భగవాజెండా” పేరుతో తీసిన చలనచిత్రాన్ని ఆవిష్కరించడానికి ఆహ్వానం మేరకు డాక్టర్జీ  పూనా వెళ్లారు. ఆ చిత్ర నిర్మాత దాదాసాహెబ్ తోరక్ డాక్టర్ జి ని  స్వాగతిస్తూ ”300 సంవత్సరాలకు పూర్వము సమర్ధ  రామదాస  స్వామి ఏ మంత్రాన్ని మహారాష్ట్రలో ఉపదేశించారో  అదే మంత్రాన్ని డాక్టర్ జి ఈ రోజున దేశమంతా ఉపదేశిస్తున్నారు.  భగవధ్వజాన్ని  రాష్ట్రీయ ధ్వజంగా పున: ప్రతిష్టించటానికి కృషి చేస్తున్నారు” అని కొనియాడారు.

ఆ సందర్భంగా డాక్టర్ జి ప్రసంగిస్తూ “మన ప్రాచీన చరిత్రను తరచి తరచి చూస్తే ఈ రాష్ట్రానికి భగవధ్వజం  ఏకైక ధ్వజం  అని రుజువు అవుతుంది. నేటి వరకు హిందూ దేశంలో ఎన్ని జాతీయ ఉద్యమాలు జరిగాయో  ఆ ఉద్యమకారులందరూ ఈ భగవాధ్వజ  ఛాయల్లోనే పనిచేశారు.  శంకరాచార్యులు,  విద్యారణ్యులు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పేర్లు మనకు కనబడతాయి”. అట్లా భగవాధ్వజాన్ని రాష్ట్ర ధ్వజంగా గుర్తింపుకు తెచ్చారు

  1. ఈ దేశం హిందువుల దేశం. ఇది హిందూ రాష్ట్రం. ఈ దేశపు పరమ  వైభవ స్థితి కోసం మనందరం పనిచేయాలి అని చెప్పారు.  డాక్టర్జీ  ప్రారంభించిన శాఖా పని ద్వారా  దేశమంతా ఒక వ్యవస్థ  నిర్మాణం జరిగింది.  ఈ రోజున ఆ వ్యవస్థ దేశంలో ఒక శక్తివంతమైనది. అది  డాక్టర్ జి దార్శనకత.  డాక్టర్ జీ ఈ లోకాన్ని విడిచే  నాటికి దేశంలో 700 శాఖలు, ఒక లక్ష మంది స్వయంసేవకులు తయారయ్యారు.

ఇది హిందూరాష్ట్రం – ఒక వాదా తీత సత్యం 

అసలు ఈ దేశం ఎవరిది? ఏ ఆలోచనలు ప్రపంచానికి శాంతిని అందించాయి?  వేల సంవత్సరాల ఘన చరిత్ర ఎవరికీ ఉన్నది?    అటువంటి చరిత్ర  ఈ దేశానికే  ఉన్నది. అటువంటి ఈ దేశాన్ని ఒక దేశం కాదని బ్రిటిష్ వాడు తన అవసరార్థం సిద్ధాంతికరించి ప్రచారం చేస్తే  ఆంగ్ల విద్యను అభ్యసించిన మన  వాళ్ళు ఆంగ్లేయుల ప్రచారాన్ని నెత్తికెక్కించుకొని  ఈ దేశం ఒక దేశం కాదు,  ఒక జాతి కాదు అంటూ బ్రిటిష్  వాళ్లకంటే ఎక్కువగా మాట్లాడటం ప్రారంభించారు.

అది ఒక ఫ్యాషన్ గా  కూడా మారిపోయింది,  దానిని కాంగ్రెస్ నేతలు పూర్తిస్థాయిలో భుజానికి ఎత్తుకొని ప్రచారం చేసారు. కాబట్టే  రాజ్యాంగంలో  ఈ దేశానికి ఏమి పేరు పెట్టాలని చర్చ తలెత్తింది.  ఆ చర్చలలో  ఈ దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. దానిపైన పెద్ద చర్చ  జరిగిన కారణంగా మన అదృష్టం బాగుండి `ఇండియా … అదే భారత్’   అని పేరు మార్చారు.  ఈ స్థితి ఎందుకు వచ్చింది?

అసలు వాస్తవం ఏంటి గమనించవలసిన అవసరం ఉంది.  అటువంటి విషయాలపై  డాక్టర్ హెడ్గేవర్ జి ఆకాలంలోనే స్వయంగా చెప్పిన మాటలలో చూద్దాం.  డాక్టర్ జి ఇది హిందూ రాష్ట్రము అని  ఇది వాదాలకు అతీతమైన ఒక సత్యం అని ప్రకటించారు,  డాక్టర్ జి కి ప్రేరణం ఈ రాష్ట్ర భక్తి అవటంవల్ల విదేశీయులైన ఆంగ్లేయులను నిరోధించడమే ఏకైక కార్యము అనే దృక్పథం వారికి రాలేదు.

భక్తితో పూజించే ఈ రాష్ట్రం యొక్క స్వరూపము ఈ మౌలిక విషయాలను లోతుగా అధ్యయనం చేశారు. హిందూ జీవనము  త్రికాల బాధిత సత్యంగా వారికి సంపూర్ణంగా సాక్షత్కరించింది.  సమకాలీన సమయంలో ప్రచారంలో ఉన్న అనైతిహాసికత, అసత్యము అయినా కలగూరగంప రాష్ట్ర వాదం బుద్ధికి, తర్కానికి అందనిది. విశుద్ధ రాష్ట్ర భావనకు విరుద్ధమైనది.

“రాష్ట్రీయ సమాజాన్ని దాని శత్రువులను విదేశీ ఆక్రమణదారులను వాటి నుండి స్వదేశాన్ని సమాజాన్ని జీవన వైశిష్ట్యాన్ని  రక్షించుకోవడానికి ప్రాణాలొడ్డి పోరాడే వారిని గుర్తించడంలో పొరపాటు జరిగింది. ఈ భ్రమలతో పనిచేస్తునంత కాలం మన దేశం మహా అనర్థాల పరంపర ఎదుర్కోవాల్సి వస్తుంది,  కాబట్టి సదా దీనిని శ్రేష్ఠస్థితిలో ఉంచుతాము” అని  ప్రకటించారు.

ఇది హిందూ రాష్ట్రము అనేది ఒక వాదాతీతమైన సత్యం అని ఈ రోజున దేశమంతా గుర్తించటం మనకు కనపడుతోంది. సుప్రీం కోర్ట్ అనేక సందర్భాల్లో హిందుత్వం అంటే ఒక జీవన విధానం అని తన తీర్పుల్లో పేర్కొనటం కూడా మనం గమనించవచ్చు   ఈమధ్య హర్యానా దగ్గరలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘం  అఖిల భారత ప్రతినిధి సభ జరిగింది ఆ సభ అనంతరం ఆర్ఎస్ఎస్  సర్ కార్యవాహ  ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఒక మాట చెప్పారు.  ఇది హిందూ రాష్ట్రం అనేది సాంస్కృతిక పరమైనది. ఇది హిందూ రాష్ట్రం అని చెప్పేందుకు రాజ్యాంగం మార్చాల్సిన అవసరం  లేదని  చెప్పారు. ఇది హిందూ రాష్ట్రంగానే  ప్రపంచమంతా గుర్తిస్తున్నదనికూడా చెప్పారు.

 (ముగింపు రేపు)