హైదరాబాద్ బీజేపీకి అభ్యర్థి మాధవీలతపై ప్రధాని ప్రశంసలు

హైదరాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఇటీవల ఆమె ఇండియా టివి ఛానెల్‌ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఆ కార్యక్రమం యూట్యాబ్ లింక్‌ను తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన ప్రధాని మాధవీలతపై ప్రశంసలు కురిపించారు. 
‘మాధవీలతా జీ… మీ ‘ఆప్‌ కీ అదాలత్‌’ ఎపిసోడ్‌ అద్భుతంగా ఉంది. చాలా కీలకమైన అంశాలను మీరు ఇందులో ప్రస్తావించారు. అవి ఎంతో తార్కికంగా ఉన్నాయి. మీకు నా శుభాకాంక్షలు’ అంటూ మోదీ ఎక్స్‌లో పోస్టు చేశారు. అలాగే ఈ ఎపిసోడ్‌ పునఃప్రసారాన్ని అందరూ చూడాలని ప్రజలకు సూచించారు. ఆ కార్యక్రమంలో ఎంతో విలువైన సమాచారం ఉందని ప్రతి ఒక్కరూ మిస్ కాకుండా చూడాలని ప్రధాని సూచించారు.
మోదీ ట్వీట్‌కు మాధవీలత స్పందించారు. ఉన్నది ఉన్నట్లు చెప్పే అలవాటు మీ నుంచే వచ్చిందని ట్వీట్ చేశారు. ‘మోదీ జీ నిజం నిర్భయంగా చెప్పే ధైర్యం నాకు మీ నుంచే వచ్చింది. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అనేది మా స్ఫూర్తి. దేశం అంతా కలిసి ముందుకు వెళ్తేనే ప్రగతి సాధిస్తాం అని మీరు ఇచ్చిన మార్గాన్ని చివరి శ్వాస, చివరి ఊపిరి వరకు మేము పాటిస్తాం హమ్ సబ్ మోడీ పరివార్.’ అని రీట్వీట్ చేశారు.
‘ఆప్‌ కీ అదాలత్‌’ కార్యక్రమంలో ఆమెను ఇంటర్వ్యూ చేసిన ఇండియా టివి సంపాదకుడు రజత్ శర్మ కూడా ప్రధానికి తన కార్యక్రమం చూసి, అభినందనలు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. విరించి ఆసుపత్రికి ఛైర్ పర్సన్ అయిన మాధవీలత ఎలాంటి రాజకీయ పూర్వరంగం లేకుండా రాజకీయాల్లోకి వచ్చారు. పార్లమెంట్ ఎన్నికల ముందు ఆమె రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. అనుహ్యంగా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిగా మాధవీలతను అదిష్ఠానం ప్రకటించింది. 
ఆధ్యాత్మిక కారక్రమాలు నిర్వహిస్తున్న మాధవీలత పాతబస్తీలో ఓ గోశాలను కూడా నడుపుతున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మరింత గుర్తింపు పొంది రాజకీయాల్లోకి వచ్చారు. హైదరాబాద్‌లో ఓటమి అంటే ఎరుగని అసద్దుదీన్ ఓవైసీతో ఆమె పోటీ పడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో తాను కచ్చితంగా గెలిచి చరిత్ర తిరగరాస్తానంటూ మాధవీలత విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పైగా, 49 ఏళ్ళ వయస్సుగల మాధవీలత హైదరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ పోటీకి దింపుతున్న మొదటి మహిళా అభ్యర్థి కావడం గమనార్హం.

ఇదిలా ఉండగా మాధవీలతకు కేంద్రం వై ప్లస్ భద్రతను కేంద్రం కేటాయించింది. చాలా సున్నితమైన పాతబస్తీలో ఆమె ఎంపీగా పోటీ చేస్తుండటంతో ఆమె భద్రతపై కేంద్ర ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది. దీంతో ఆమెకు వై ప్లస్ భద్రతను కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. మెుత్తం 11 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు ఆమెకు రక్షణ అందించనున్నారు. ముగ్గురు ఇంటి వద్ద రక్షణగా ఉండనుండగా, మిగిలిన 8 మంది నలుగురు చొప్పున రెండు షిఫ్టుల్లో ఆమెకు భద్రతగా ఉండనున్నారు.