ఫోన్ ట్యాపింగ్ తొలి బాధితుడ్ని నేనే

తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే.. పలువురు సీనియర్ పోలీసు అధికారులను అరెస్ట్ చేసి విచారించగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే  పలువురు రాజకీయ నేతలు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. 
 
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాము కూడా బాధితులమే అంటూ మీడియా ముందుకొస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ బాధితుల వరుసలో తాను మొదటివాడినంటూ చెప్పుకొచ్చారు మాజీ మంత్రి, మల్కాజిగిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్. ఆదివారం రోజున మీట్ ది ప్రెస్ కార్యక్రమం నిర్వహించిన ఈటల రాజేందర్.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారంలో మొదటి బాధితుడిని నేనేనని కీలక వ్యాఖ్యలు చేశారు. 
 
తనతో పాటు తన కుటుంబసభ్యులు, డ్రైవర్, వంట మనుషుల నుంచి ప్రతి ఒక్కరి ఫోన్ ట్యాప్ చేశారంటూ కీలక ఆరోపణలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వల్లే తాను ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్నానని తెలిపారు. కేసీఆర్ హయాంలో తన కేబినెట్‌లోని 17 మంది మంత్రులను కూడా నమ్మలేదని ఆయన సంచలన ఆరోపణలు చేశారు.

మంత్రుల ఫోన్లు ట్యాప్ చేసి భార్యభర్తల సంభాషణలు కూడా విన్నారని ఈటల ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల కొందరి కాపురాలు కూడా కూలిపోయాయని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఇది చాలా బాధకరమని పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.

 
బీఆర్ఎస్ హయాంలో గెలిచిన ఎమ్మెల్యేలను కాదని ఓడిన ఎమ్మెల్యేలతో ప్రారంభోత్సవాలు జరిపించారంటూ తీవ్ర విమర్శలు చేశారు ఈటల. ఎమ్మెల్యేగా ఉన్న కనీసం ప్రోటోకాల్ కూడా లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతమున్న రేవంత్ రెడ్డి సర్కారు కూడా అదే పద్ధతిని అవలంభిస్తోందని ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డిని కొడంగల్‌లో ఓడించిన పట్నం నరేందర్ రెడ్డి కుటుంబీకులను కాంగ్రెస్ ఇప్పుడు మల్కాజిగిరి బరిలో దింపిందంటూ దెప్పిపొడిచారు

కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసి, బీఆర్ఎస్ నుంచి మెడలు పట్టి బయటకు పంపితే.. బీజేపీ తనను అక్కున చేర్చుకుందని తెలిపారు ఈటల. ఇక త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ 12 సీట్లకు పైనే గెలుస్తుందని ఈటల రాజేందర్ ధీమా వ్యక్తం చేశారు.