భారత్ లో న్యూస్ రూమ్ మూసేసిన బిబిసి

భారతదేశంలో తన న్యూస్ రూమ్ ను బిబిసి మూసివేసింది. ఆదాయపు పన్ను శాఖ నిరంతర దాడులు, విచారణల అనంతరం ఈ నిర్ణయం తీసుకుంది. బిబిసి ప్రచురణ లైసెన్స్‌ను భారతీయ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి బదిలీ చేసినట్లు బిబిసి ప్రకటించింది. అక్టోబర్ 2021లో వచ్చిన చట్టం ప్రకారం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై 26 శాతం పరిమితి విధించడంతో అందుకు అనుగుణంగా బిబిసి తన వ్యాపార ప్రకియలో కొన్ని మార్పులు చేసుకోవలసి వచ్చింది. 

ఉద్యోగులతో కలెక్టివ్ న్యూస్ రూం పేరుతో దేశంలో ప్రసారాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. పబ్లిషింగ్ లైసెన్స్‌ను మరో సంస్థకు అప్పగించడం తన చరిత్రలో ఇదే తొలిసారి అని పేర్కొంది. జర్నలిజంలో రాజీపడబోమని బిబిసి స్పష్టం చేసింది.

2002 గుజరాత్ మారణహోమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాత్రపై వివాదాస్పదంగా రూపొందించిన ‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే డాక్యుమెంటరీ ప్రసారం కలకలం రేపింది. ఆ తర్వాత  ఢిల్లీ, ముంబైలలోని బిబిసి కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసింది. ఆపై ఉల్లంఘనను గుర్తించి నోటీసు జారీ చేసింది. 

గత ఫిబ్రవరిలో బిబిసి 2002 గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీని ప్రసారం చేయగా, కేంద్ర ప్రభుత్వం ఆ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిషేధించింది. గుజరాత్ అల్లర్లలో నరేంద్ర మోదీ పాత్రను వివరించడంతో డాక్యుమెంటరీ వివాదాస్పదంగా మారింది.  ఈ నేపథ్యంలో బిబిసి భారత్‌లోని న్యూస్‌రూమ్‌లను మూసివేయాలని నిర్ణయించింది. బిబిసి మే 1940లో భారతదేశంలో ప్రసారాన్ని ప్రారంభించింది. హిందీ, గుజరాతీ, మరాఠీ, పంజాబీ, తమిళం, తెలుగు భాషలలో బిబిసి ఇండియా పనిచేస్తుంది.