విస్తారా పైలట్ల శిక్షణంపై డీజీసీఏ నోటిస్

టాటాగ్రూప్‌ నేతృత్వంలోని ఏవియేషన్‌ కంపెనీ విస్తారాను గత కొద్దిరోజులుగా సమస్యలు వెంటాడుతున్నాయి. పైలైట్ల రాజీనామాలు.. సామూహిక సెలవులతో వందలాది విమానాలు రద్దయ్యాయి. ఈ క్రమంఓలనే కంపెనీకి తాజాగా డీజీసీఏ షాకిచ్చింది.

 పైలట్ల శిక్షణకు సంబంధించి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నోటీసు జారీ చేసింది. కంపెనీ పైలట్ శిక్షణ ఉల్లంఘనలకు పాల్పడిందనే ఆరోపణల నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది. పైలట్లకు శిక్షణ ఇచ్చే ప్రక్రియలో జీరో ఫ్లైట్‌ టైమ్‌ ట్రైనింగ్‌ లో భాగంగా పైలట్లు వివిధ రకాల విమానాలను నడపడానికి శిక్షణ పొందుతారు. ఇందులో పైలట్లు అనేక దశల్లో శిక్షణ పొందాల్సి ఉంటుంది.

అయితే, ఈ ప్రక్రియలపై డీజీసీఏ ప్రశ్నలు లేవనెత్తింది. జీరో ఫ్లైట్‌ టైమ్‌ ట్రైనింగ్‌లో భాగంగా విస్తారా పైలట్లు బోయింగ్ 787 విమానాలను నడపాల్సి ఉంది. అయితే, నిబంధనలను ఉల్లంఘించినందుకు నోటీసుల నేపథ్యంలో శిక్షణ తాత్కాలికంగా నిలిచిపోయింది. పైలట్లు అప్పటికే ఎయిర్‌బస్ ఏ320 విమానాలను నడుపుతున్నారు. 

శిక్షణలో భాగంగా బోయింగ్ 787 విమానాలను నడపాల్సి వచ్చింది. విస్తారా యూరోపియన్ రూట్లలో బోయింగ్ 787 విమానాలను ఉపయోగిస్తున్నది. టాటా గ్రూప్‌కు చెందిన ఏవియేషన్ కంపెనీ ఇప్పటికే ఇబ్బందులను ఎదుర్కొంటున్న తరుణంలో డీజీసీఏ నోటీసు ఇచ్చింది. ఈ వారం మొదటి మూడు రోజుల్లో విస్తారా 150కిపైగా విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది.

కాగా, పైలట్లతో తలెత్తిన సమస్యల కారణంగా ప్రతిరోజూ 20 శాతం సర్వీస్ లను, అంటే 25 నుండి 30 విమానాలను రద్దుచేస్తున్నట్లు విస్తార యాజమాన్యం ఆదివారం ప్రకటించింది.