మోదీ పర్యటనతో లక్షద్వీప్‌కు పర్యాటకులు పెరిగారు

కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌ పర్యాటకానికి కొత్త రెక్కలొచ్చాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  పర్యటన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం లక్షద్వీప్‌ దీవులను సందర్శించే వారి సంఖ్య గతంలో కంటే భారీగా పెరిగినట్లు అక్కడి పర్యాటక శాఖ అధికారులు తాజాగా వెల్లడించారు.
 
‘ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశంలో ప్రభావవంతమైన నాయకుడు. డిసెంబర్‌ 2023లో లక్షద్వీప్‌ దీవులను మోదీ సందర్శించారు. ఆయన పర్యటనతో లక్షద్వీప్‌కు పర్యాటకుల సంఖ్య పెరిగింది. అంతర్జాతీయ, విదేశీ పర్యాటకులు ఈ ద్వీపాన్ని సందర్శించడానికి ప్యాకేజీల కోసం మమ్మల్ని సంప్రదిస్తున్నారు. 
ప్యాకేజీల గురించి మరింత తెలుసుకునేందుకు ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఆన్‌లైన్‌లో పెద్ద ఎత్తున సెర్చ్‌ చేస్తున్నారు’ అని అక్కడి పర్యాటకశాఖ అధికారి ఇంతియాస్‌ మహ్మద్‌ తెలిపారు.
మరోవైపు లక్షద్వీప్‌లో వివిధ పర్యాటక కార్యకలాపాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ లక్షద్వీప్ టూరిజంలో ప్రధాన ఆదాయాన్ని అందించే విభాగాలని ఇంతియాజ్‌ వెల్లడించారు. భవిష్యత్తులో లక్షద్వీప్‌ మరిన్ని క్రూయిజ్‌ షిప్‌ కంపెనీలను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా ఎయిర్‌ కనెక్టివిటీని క్రమబద్ధీకరించడం వల్ల పర్యాటకులను ఆకర్షించే అవకావం ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.