ములుగు ఎన్‌కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి

తెలంగాణ- ఛత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో శనివారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టుల కదలికలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు అడవిని జల్లెడపట్టారు. ఈ క్రమంలో ములుగు జిల్లా వెంకటాపురం వద్ద కర్రెగుట్టల వద్ద తారసపడిన మావోయిస్టులపై భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి.  మావోయిస్టులు కూడా ప్రతిఘటించి పోలీసులపై కాల్పులు జరిపారు.
ఈ ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు ఎన్‌కౌంటర్ అయ్యారు. ఘటనా స్థలంలో 3 తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఇంది.  రెండ్రోజుల క్రితం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ రీజియన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
జీజాపూర్‌ జిల్లాలోని కోర్చోలీ అడవుల్లో ప్లీనరీ నిర్వహించనున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా రిజర్వు గార్డ్స్‌(డీఆర్‌జీ), సీఆర్పీఎఫ్‌, కోబ్రా, బస్తర్‌ ఫైటర్స్‌, ఛత్తీస్‌గఢ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్స్‌(సీఏఎఫ్‌) భద్రతా బలగాలు గంగలూరు పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అడవులను చుట్టుముట్టాయి.
 
ఈ క్రమంలో కోర్‌చోలీ సమీపంలోని లెంద్రా అడవుల్లో తారసపడిన మావోయిస్టు దళాలు జవాన్లపై కాల్పులు జరిపారు. వెంటనే జవాన్లు అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపారు. రెండు గ్రూపుల మధ్య దాదాపు రెండు గంటల పాటు తుపాకుల మోత మోగింది. 
 
ఎన్‌కౌంటర్‌ అనంతరం భద్రతా బలగాలు ఘటనాస్థలిలో మొత్తం 13 మంది నక్సలైట్ల మృతదేహాలతో పాటు భారీయెత్తున ఆయుధ, వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా గత నెల 27న ఇదే బీజాపూర్‌ జిల్లాలో ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు నక్సలైట్లు మరణించారు. తాజాగా.. తెలంగాణ- చత్తీస్‌ఘడ్ సరిహద్దుల్లో మరో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు.