ముస్లిం లీగ్ భావజాలంతో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టో

నేటి భార‌త్‌కు కావాల్సిన ఆశ‌లు, ఆశ‌యాల‌కు దూరంగా ప్ర‌తిప‌క్ష పార్టీ ఉంద‌ని, కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో ముస్లిం లీగ్ భావ‌జాలాన్ని పోలి ఉన్న‌ద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ విమర్శించారు. ప్ర‌ధాని మోదీ తొలిసారి కాంగ్రెస్ మ్యానిఫెస్టోపై స్పందిస్తూ కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో స్వాతంత్రోద్యమం నాటి ముస్లిం లీగ్ ఆన‌వాళ్లు ఉన్నాయ‌ని, కొంత భాగం లెఫ్టిస్ట్ భావ‌జాలం నిండి ఉన్న‌ట్లు ఆరోపించారు.

యూపీలోని ష‌హ‌రాన్‌పుర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల స‌భ‌లో ప్ర‌ధాని మోదీ ప్రసంగిస్తూ దేశ స్వ‌తంత్య్రం కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీ క‌థ కొన్ని దశాబ్ధాల క్రిత‌మే ముగిసింద‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని తెలిపారు. ఆశ‌లు, ఆశ‌యాలు లేని కాంగ్రెస్ పార్టీ త‌న మ్యానిఫెస్టోతో దేశాన్ని ముందుకు న‌డిపించ‌లేద‌ని స్పష్టం చేశారు. జాతీయ ప్ర‌యోజ‌నాల కోసం కాంగ్రెస్ వ‌ద్ద ప్ర‌ణాళిక‌లు లేవ‌ని, దేశ ప్ర‌గ‌తి ప‌ట్ల విజ‌న్ కూడా లేద‌ని మోదీ ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ తిరిగి ఈ ఎన్నికల్లో జత కట్టడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిశిత విమర్శలు గుప్పించారు. 2017లో ఇద్దరి భాగస్వామ్యాన్ని గుర్తు చేస్తూ, అప్పటి ‘ఫ్లాప్ ఫిల్మ్’ మరోసారి రిలీజ్ అవుతోందని ఎద్దేవా చేశారు. తమకు గట్టిపట్టున్న చోట్ల కూడా గ్రేండ్ పురాతన పార్టీకి అభ్యర్థులు దొరకడం కష్టంగా ఉందని చెప్పారు.

”నేను మొదటిసారి ఇలాంటి ఎన్నికలను చూస్తున్నాను. విపక్షాలు గెలుపు కోసం పోటీ చేయడం లేదు. కేవలం బీజేపీని 370 సీట్లు లోపు, ఎన్డీయేని 400 సీట్లు లోపు నిరోధించేందుకే పోటీ చేస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ గంట గంటకు అభ్యర్థులు మారుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరో ఘోరంగా ఉంది. తమకు గట్టి పట్టున్న చోట్ల కూడా అభ్యర్థులు దొరకడం లేదు. ఇద్దరు కుర్రాలు (రాహుల్, అఖిలేష్) కలిసి చేసిన సినిమా గత పర్యాయం ఫ్లాప్ అయింది. అయినా మరోసారి తెరపైకి వస్తున్నారు” అని మోదీ ధ్వజమెత్తారు.

శక్తి మాతను మనం పూజిస్తామని, అయితే ‘మా శక్తి’తోనే తమ పోరాటమని ‘ఇండియా’ కూటమి గట్టిగా చెబుతోందని ప్రధాన మంత్రి చరుకలు వేశారు. భారతీయ జనతా పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సాన్ని ఈ సందర్భంగా ఆయనను ప్రస్తావిస్తూ, కొద్ది దశాబ్దాల్లోనే దేశ జనాభాల్లో రికార్డు స్థాయిలో ప్రజలు బీజేపీలో చేరారని, ప్రజావిశ్వాసాన్ని పార్టీ పొందగలిగిందని, ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకుందని తెలిపారు.

రాజకీయాలను కాకుండా, జాతీయ విధానాన్ని బీజేపీ నమ్ముకోవడమే ఇందుకు ప్రధాన కారణమని చెప్పారు. ‘నేషన్ ఫస్ట్’ అనే నినాదంతో బీజేపీ సేవలందిస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వివక్షకు తావులేని పాలన అందిస్తోందని చెప్పారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేస్తూ బిల్లు తెచ్చామని, 370వ అధికరణను రద్దు చేస్తామని చెప్పినట్టే చేసి చూపించామని, వికసిత్ జమ్మూకశ్మీర్‌ నిర్మాణం మొదలైందని తెలిపారు.

పదేళ్లలో ప్రభుత్వ పథకాలు దేశంలోని మారుమూలలకు కూడా అందేలా చేశామని స్పష్టం చేశారు. కేంద్ర పథకాలతో 100 శాతం ప్రజలు ప్రయోజనం పొందినప్పుడే అది నిజమైన సెక్యులరిజం, నిజమైన సామాజిక న్యాయం అవుతుందని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌ నియోజకవర్గంతో పాటు ఏడు లోక్‌సభ స్థానాల్లో మొదటి దశ పోలింగ్‌లో భాగంగా ఏప్రిల్ 19న ఎన్నికలు జరుగనున్నాయి.