మొన్న ఈడీ, ఇప్పుడు ఎన్ఐఏ అధికారులపై రాళ్ల దాడి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అధికారులపై పశ్చిమ బెంగాల్‌లో దాడి జరిగింది. తూర్పు మిడ్నాపూర్ జిల్లాలోని భూపతి నగర్‌కు శనివారం ఉదయం వెళ్లిన ఎన్ఐఏ అధికారులపైకి స్థానికులు దాడి చేశారు. గతంలో జరిగిన ఓ పేలుడు కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారులు భూపతి నగర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. 
 
ఇంతలోనే విషయం తెలుసుకున్న భూపతినగర్‌ వాసులు ఎన్‌ఐఏ బృందాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎన్‌ఐఏ అధికారులను చుట్టుముట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా జనం అధికారుల వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఇద్దరు అధికారులు గాయపడినట్లు తెలిసింది.  వాహనం అద్దాలు పూర్తిగా ధ్వంసమైనట్లు సమాచారం. ఈ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు స్థానిక పోలీసులు తెలిపారు.
ఇటీవలె పశ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో టీఎంసీ బహిష్కృత నేత షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై దాడి చేసిన ఘటన జరిగిన కొన్నిరోజులకే ఈ సంఘటన చోటు చేసుకోవడం గమనార్హం. 2022 డిసెంబర్‌లో భూపతినగర్ పేలుడు కేసు దర్యాప్తులో భాగంగా ఆ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అరెస్టు చేశారు.
ఆ క్రమంలోనే ఆ వ్యక్తిని విచారణ కోసం తీసుకెళ్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. అనంతరం ఎన్‌ఐఏ అధికారులను చుట్టుముట్టి ఆ వ్యక్తిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతోపాటు ఎన్‌ఐఏ అధికారుల బృందం ప్రయాణిస్తున్న కారుపై ఇటుకలు, రాళ్లు విసిరినట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఎన్ఐఏ అధికారులు గాయపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. 
 
ఈ ఘటనతో భూపతి నగర్‌లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో ఎన్ఐఏ బృందం వెంట సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్-సీఆర్‌పీఎఫ్ సిబ్బంది కూడా ఉన్నారు. అనంతరం అక్కడి ఉద్రిక్త పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. దాడి అనంతరం ఎన్ఐఏ అధికారులను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.
 
2022 డిసెంబర్‌లో భూపతినగర్ పేలుడు సంభవించింది. ఈ కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ అధ్యక్షుడు రాజ్‌కుమార్‌ మన్నా, ఆయన సోదరుడు దేవ్‌కుమార్‌ మన్నా, విశ్వజిత్‌ గయెన్‌లపై ఆరోపణలు వచ్చాయి.  ఇక ఈ కేసులో విచారణకు సంబంధించి ఎన్ఐఏ అధికారులు గతంలోనే 8 మంది తృణమూల్ కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేసింది. 
 
నవకుమార్ పాండా, మిలన్ బార్, అరుణ్ మైతీ అలియాస్ ఉత్తమ్ మైతీ, సుబీర్ మైతీ, శివప్రసాద్ గయెన్, బలైచరణ్ మైతీ, మానవకుమార్ బారువా, అనుబ్రత జానాలు హాజరుకావాలని ఆదేశించింది. గతంలో వీరికి నోటీసులు పంపించినా వారు స్పందించలేదు. దీంతో వారం రోజుల క్రితం రెండోసారి నోటీసులు పంపించినా వారు పట్టించుకోకపోవడంతో అధికారులు రంగంలోకి దిగారు.  ఇక ఇటీవలె సందేశ్‌ఖాలీ ఘటనలో నిందితుడిగా ఉన్న షాజహాన్‌ను అరెస్ట్ చేసేందుకు ఈడీ అధికారులు వెళ్లగా వారిపైకి స్థానికుల దాడి చేశారు.