2040 నాటికి ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు రెట్టింపు

భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ పడగ విప్పబోతున్నదని, కేసుల సంఖ్య, మరణాలు భారీగా పెరిగే ప్రమాదం పొంచి ఉన్నదని లాన్సెట్‌ కమిషన్‌ ఆన్‌ ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ అధ్యయనంలో వెల్లడైంది. భారత్‌తో పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ఎక్కువగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు పెరుగుతాయని ఈ అధ్యయనం అంచనా వేసింది. వెన్నెముకకు క్యాన్సర్ సోకడం ఈ ప్రాణాంతక ప్రోస్టేట్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. ప్రోస్టేట్ గ్రంధిని ప్రభావితం చేయడం వల్ల వయస్సు మళ్లిన వారిలో ఉండే అతి మూత్రవిసర్జన, మూత్రకోశ సమస్యలు తీవ్రతరం అవుతాయి

2020 నుంచి 2040 మధ్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు రెట్టింపు అవుతాయని, ఈ వ్యాధి కారణంగా మరణాలు కూడా 85 శాతం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం భారత్‌లో నమోదవుతున్న మొత్తం క్యాన్సర్‌ కేసుల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులు దాదాపుగా మూడు శాతం వరకు ఉంటున్నాయి. 
 
ఇప్పుడు భారత్‌లో ఏడాదికి 33 వేల నుంచి 42 వేల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కేసులను గుర్తిస్తున్నారు. 2040 నాటికి భారత్‌లో ఏడాదికి 71 వేల మంది దీని బారిన పడవచ్చని ఈ అధ్యయనం అంచనా వేసింది.  భారత్‌తో పాటు తక్కువ, మధ్య ఆదాయ దేశాల్లో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడ్డ వారిని గుర్తించడం ఆలస్యం అవుతుండటమే అసలు సవాల్‌గా మారింది. 
 
చాలామందిలో వ్యాధి ముదిరిన తర్వాతనే ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ను గుర్తించడం వల్ల మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి. భారత్‌లో ఎక్కువ మందిలో వ్యాధి తుది దశల్లో ఉన్నప్పుడు గుర్తించడం వల్ల 65 శాతం బాధితులు మరణిస్తున్నారని ఈ అధ్యయనంలో పాల్గొన్న డాక్టర్‌ వేదాంగ్‌ మూర్తి పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ప్రొస్టేట్‌ క్యాన్సర్‌తో ఏడాదికి 18 వేల నుంచి 20 వేల మరణాలు సంభవిస్తున్నట్లు చెప్పారు. 
 
60 ఏండ్లు దాటిన పురుషులకు క్రమం తప్పకుండా పరీక్షలు జరపడం ద్వారా వ్యాధిని వేగంగా గుర్తించి చికిత్స అందించవచ్చని ఆయన తెలిపారు. వయసు, జన్యుపరమైన కారణాలతో పాటు ధూమపానం, ఒబెసిటీ, సరైన ఆహారం తీసుకోకపోవడం, జీవనశైలి సమస్యల వల్ల ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నట్టు వెల్లడించారు.
ఆయా దేశాలలో ఇప్పుడు ఇటువంటి క్యాన్సర్‌కు సంబంధించి సరైన నిర్థారణ పరీక్షలు, సకాలంలో చికిత్సలకు ఏర్పాట్లు లేకపోవడం, ప్రజలలో అవగావహన లేకపోవడం ఈ దేశాలలో ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు మరింతగా పెరగడానికి దారితీస్తుంది. 50 అంతకు మించిన వయస్సు వారికి ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని తగు విధంగా వ్యవహరించి, జీవన ఆహారశైలిని మార్చుకోవడం వంటి చర్యలకు దిగితే నియంత్రణకు వీలుంటుందని ఈ కమిషన్ నివేదిక ప్రధాన కర్త నిక్ జేమ్స్ తెలిపారు.