ఓటు హక్కు పట్ల ఆసక్తి చూపని భారతీయ యువత

 
* యువత ఓటు నమోదులో మొదటి స్థానంలో తెలంగాణ
 

ప్రజాస్వామ్యంలో ప్రజల అభీష్టం మేరకు ప్రభుత్వం ఏర్పడాలంటే వజ్రాయుధం ఓటు. 18 ఏండ్లు దాటిన పౌరులకు ఓటు ఒక హక్కు. అయితే, మన దేశంలో ఓటు వేసే వయసు వచ్చినప్పటికీ ఓటు హక్కు పొందడానికి మాత్రం యువత అంతగా ఆసక్తి చూపించడం లేదు. 

 
మన దేశంలో ప్రస్తుతం 18, 19 ఏండ్ల వయసు ఉన్న యువత 4.9 కోట్ల మంది ఉన్నారు. వీరందరికీ ఓటరుగా నమోదు చేసే వయసు వచ్చినప్పటికీ కేవలం 1.8 కోట్ల మంది మాత్రమే ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకున్నారు. అంటే, ఓటేసే వయసు వచ్చినప్పటికీ కేవలం 38 శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. 
 
మన దేశంలో 1988 వరకు ఓటు వేయాలంటే కనీస వయసు 21 ఏండ్లు ఉండేది. కానీ, చట్టసభల సభ్యులను ఎన్నుకోవడంలో యువతను భాగం చేయాలనే ఆలోచనతో 1988లో రాజ్యాంగ సవరణ చేసి మరీ ఓటు హక్కు వయసును 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించారు. కానీ, ఈ అవకాశాన్ని మాత్రం యువత ఉపయోగించుకోవడం లేదనేది తాజా లెక్కలను బట్టి తెలుస్తున్నది.
 
అయితే, దేశంలో 18, 19 ఏండ్ల యువత ఎక్కువగా ఓటర్లుగా నమోదైన రాష్ర్టాల్లో తెలంగాణనే మొదటి స్థానంలో ఉంది. తెలంగాణలో 18, 19 ఏండ్ల వయసు వారు 12 లక్షల మంది ఉండగా దాదాపు 8 లక్షల మంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. అంటే 66.7 శాతం తెలంగాణ యువత ఓటును హక్కుగా పొందారు. 
 
తర్వాత జమ్ము కశ్మీర్‌లో 62 శాతం, హిమాచల్‌ ప్రదేశ్‌లో 60 శాతం మంది 18,19 ఏండ్ల వయసు యువత ఓటరు జాబితాలో చేరారు. ఇక ఉత్తరప్రదేశ్‌లో కేవలం 23 శాతం, మహారాష్ట్రలో 27 శాతం మంది మాత్రమే ఓటు హక్కు పొందారు. 
 
అత్యల్పంగా బీహార్‌లో ఓటు హక్కు వయసు వచ్చినా నమోదు చేసుకున్నది కేవలం 17 శాతం మంది మాత్రమే. బీహార్‌లో 18, 19 ఏండ్ల వయసు వారు 54 లక్షల మంది ఉంటే కేవలం 9.3 లక్షల మంది మాత్రమే ఓటరు జాబితాలో ఉన్నారు. దేశ రాజధాని ఢిల్లీలోనూ కేవలం 21 శాతం మందే నమోదు చేసుకున్నారు.