అందుబాటులోకి సీబీఎస్ఈ కొత్త సిలబస్ పాఠ్యపుస్తకాలు

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 3, 6 తరగతులకు మాత్రమే కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను విడుదల చేస్తామని, ఇతర తరగతుల పాఠ్యాంశాలు, పాఠ్యపుస్తకాల్లో ఎలాంటి మార్పులు ఉండవని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ( ఎన్సీఈఆర్టీ) తెలిపింది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో ఈ వివరాలను వెల్లడించింది.

‘‘సీబీఎస్ఈ” 3, 6 తరగతుల కోసం ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023కు అనుగుణంగా రూపొందించిన కొత్త పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి. 2024 ఏప్రిల్ రెండో వారం నాటికి 3 వ తరగతి పుస్తకాలు, 2024 మే మధ్య నాటికి 6 వ తరగతి పుస్తకాలు అందుబాటులోకి వస్తాయి’’ అని వివరించింది. దేశవ్యాప్తంగా 1, 2, 7, 8, 10, 12 తరగతుల పాఠ్యపుస్తకాలకు సంబంధించి 2023-2024 ఎడిషన్లలో 1.21 కోట్ల కాపీలు విడుదలయ్యాయని ఎన్సీఈఆర్టీ తెలిపింది. 

ఈ తరగతులకు అవసరమైన అదనపు పుస్తకాలను క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచుతామని పేర్కొన్నారు. 4, 5, 9, 11 తరగతులకు సంబంధించి 27.58 లక్షల పుస్తకాలను విడుదల చేసినట్లు  ఎన్సీఈఆర్టీ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ తరగతులకు సంబంధించిన 1.03 కోట్ల కాపీలు 2024 మే 31 నాటికి అందుబాటులో ఉంటాయని తెలిపింది.

అన్ని ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాల డిజిటల్ కాపీలు ఎన్సీఈఆర్టీ పోర్టల్, పీఎం ఈ విద్య, దీక్ష,  ఈ పాఠశాల పోర్టల్, నేషనల్ డిజిటల్ లైబ్రరీలో ఉచితంగా లభిస్తాయి. డిజిటల్ కాపీలను ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఎన్సీఈఆర్టీ తెలిపింది.

 3, 6 తరగతులకు సంబంధించి కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయని, త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్ఈకి అనుబంధంగా ఉన్న అన్ని విద్యా సంస్థల అధిపతులకు మార్చిలో ఎన్సీఈఆర్టీ తెలియజేసింది. 2023 వరకు ఎన్సీఈఆర్టీ ప్రచురించిన పాఠ్యపుస్తకాల స్థానంలో 3, 6 తరగతులకు ఈ కొత్త సిలబస్, పాఠ్యపుస్తకాలను అనుసరించాలని పాఠశాలలకు సూచించింది.

 నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలులో భాగంగా పాఠశాల విద్య కోసం కొత్త జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్ వర్క్ ( ఎన్సిఎఫ్-ఎస్ఇ 2023) 2023 కు అనుగుణంగా ఎన్సీఈఆర్టీ కొత్త సిలబస్ తో పాఠ్యపుస్తకాలను సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే.