కాంగ్రెస్ మేనిఫెస్టోతో దానం, కడియంలలో కలవరం

అధికారం అందుబాటులో లేకపోతే మనుగడ సాగించలేని పలువురు బిఆర్ఎస్  నాయకులు పలువురు వరుసపెట్టి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. పైగా, కాంగ్రెస్ పార్టీ గేట్లు తెరిచామని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడంతో కొద్దిరోజులుగా చేరికలు జోరుగా సాగుతున్నారు. ఈ తరుణంలోనే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఎన్నికల మానిఫెస్టో ఆ విధంగా చేరుతున్న కొంతమంది నేతలను ఇరకాటంలోకి నెట్టివేస్తున్నది. 
 
ఒక పార్టీ గుర్తుమీద గెలుపొంది మరో పార్టీలోకి చేరేవారు తమ తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాత మాత్రమే పార్టీలోకి చేరేలా చట్టసవరణ తీసుకు వస్తామని మానిఫెస్టోలో కాంగ్రెస్ ప్రకటించింది. దానితో పదవులకు రాజీనామా చేయకుండా బిఆర్ఎస్ లో చేరుతున్న నేతలకు పెద్ద షాక్ తగిలింనట్లయింది.

పైగా, ఇతర పార్టీల నుండి వచ్చి తమ పార్టీలో చేరుతున్న నాయకులు తమ పదవులకు రాజీనామా చేసిన తర్వాత తమ పార్టీలోకి రావాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్యెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరిలలో కలవరం కలిగిస్తున్నది. 
 
ఈ ఇద్దరు నేతలు తమ పదవులకు రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పైగా, నాలుగు నెలల క్రితమే వీరిద్దరూ ఎమ్యెయేలుగా ఎన్నికయ్యారు. బిఆర్ఎస్ ఎమ్యెల్యేగా ఉంటూనే కాంగ్రెస్ ఎంపీగా సికింద్రాబాద్ నుండి పోటీ చేసేందుకు దానం సిద్దపడుతున్నారు. ఈ విషయమై ఇప్పటికే హైకోర్టులో ఓ కేసు నడుస్తున్నది. 
 
కడియం శ్రీహరి తమ కుమార్తెకు బిఆర్ఎస్ వరంగల్ ఎంపీ సీటు ఇప్పించుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టో అనుసరించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరిద్దరిపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అన్నది ఆసక్తి కలిగిస్తోంది. ఒక విధంగా వారిద్దరిని కాంగ్రెస్ లో చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన రేవంత్ రెడ్డికి సహితం రాహుల్ ఈ విధమైన ప్రకటన చేయడం సంకట పరిస్థితి కలిగిస్తున్నది.
 
ఇప్పటి వరకు ఎమ్యెల్యే పదవులకు రాజీనామా చేయకుండా పార్టీ యెట్లా మారుతారంటూ ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తున్నారు. గతంలో బిఆర్ఎస్ సహితం పెద్ద సంఖ్యలో ఇతర పార్టీల ఎమ్యెల్యేలను ఆ విధంగా పదవులకు రాజీనామా చేయించకుండానే తన పార్టీలో చేర్చుకోవడంతో ఇప్పుడు వీరిద్దరూ కాంగ్రెస్ లోకి వెడుతుంటే మాట్లాడలేక పోతున్నారు.
 
వాస్తవానికి ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తారనే దానం నాగేందర్ కు లోక్ సభ సీట్ ను రేవంత్ రెడ్డి ఖరారు చేయించారని తెలుస్తున్నది. అయితే లోక్ సభకు ఎన్నికైన తర్వాతనే ఎమ్యెల్యేగా రాజీనామా చేస్తానని ఇప్పుడు నాగేందర్ మెలిక పెడుతున్నట్లు చెబుతున్నారు. ఎంపీగా గెలిచే అవకాశాలు లేకపోవడంతో గెలిచినా ఎమ్యెల్యే పదవి కూడా పోతే తిరిగి గెలవడం కష్టం అని భయంగా ఉన్నట్లు తెలుస్తున్నది.