కాంగ్రెస్ మోసాలకు కేరాఫ్ అడ్రస్

కాంగ్రెస్ పార్ అంటేనే మోసాలకు కేరాఫ్ అడ్రస్ అని, ఆ పార్టీది ‘ఆపన్న హస్తం కాదు..భస్మాసుర హస్తమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ‘పాంచ్ న్యాయ్’ పేరుతో కాంగ్రెస్ సరికొత్త హామీలతో ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమైందని విమర్శించారు.
 
 తెలంగాణను 10 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్, రాష్ట్రంలో రైతుల దుస్థితికి ప్రధాన కారణమని విమర్శించారు. 30 లక్షల ఎకరాల్లో పంట నష్టపోతే ఏనాడూ సాయమందించని కేసీఆర్ సిగ్గు లేకుండా రైతులపట్ల ప్రేమను ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ మోసపూరిత పార్టీలేనని, రైతులు, నేతన్నల దుస్థితికి రెండు పార్టీలే కారణమని దుయ్యబట్టారు. 
 
రాష్ట్రంలోని నేతన్నల దుస్థితికి నిరసనగా వారిని ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్ తో ఈనెల 10న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సిరిసిల్లలో ‘దీక్ష’ చేస్తున్నట్లు ప్రకటించారు. పొలంబాటలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) ఎండిపోయిన పంటలను పరిశీలించడం సంతోషకరమే అయినప్పటికీ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇబ్బందులు పడ్డ రైతులు ఇప్పుడు గుర్తుకు వచ్చారా అని సంజయ్ ప్రశ్నించారు.
 
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పార్టీలు అవగాహనతో వెళుతున్నాయని  పేర్కొంటూ అందుకే బీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోదని, కాళేశ్వరం అక్రమాలపై కేసీఆర్ కుటుంబంపై కేసులు పెట్టదని విమర్శించారు. అందుకు ప్రతిఫలంగా 6 గ్యారంటీలను ఎందుకు అమలు చేయడం లేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ నిలదీయదని తెలిపారు‌. 
 
రెండు పార్టీలు లోపల కుమ్కక్కై పైన డ్రామాలాడుతున్నాయని, ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్ కుటుంబమే ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంలో ఉందంటూ మరి ఎందుకు వాళ్లను అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. నయీం ఆస్తులను కేసీఆర్ కుటుంబం దోచుకుందని అందరికీ తెలుసు… దమ్ముంటే నయీం ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. 
 
ఈ వ్యవహారంపై సిట్ విచారణను కొనసాగించాలని డిమాండ్ చేశారు. డ్రగ్స్, మియాపూర్ భూముల కుంభకోణంపై విచారణ జరపాలని స్పష్టం చేశారు. వీటిపై విచారణ జరపకుండా ఫోన్ ట్యాపింగ్ పేరుతో ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని ఆరోపించారు.