చైనా, జపాన్‌లలో భూకంపం

తూర్పు ఆసియా దేశాలను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. బుధవారం ఉదయం తైవాన్‌ను శక్తిమంతమైన భూకంపం వణికించిన విషయం తెలిసిందే. తాజాగా  చైనా, జపాన్‌లలో గురువారం తెల్లవారుజామున భూకంపం వచ్చింది. వాయువ్య చైనాలోని కింగ్‌హై ప్రావిన్స్‌లోని మంగ్యా నగరంలో 5.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైనట్టు వెల్లడించింది.
 
జపాన్‌లో గురువారం ఉదయం హోన్షు తూర్పు తీరంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు యూరోపియన్‌- మెడిటరేనియన్‌ సిస్మోలాజికల్‌ సెంటర్‌  తెలిపింది. రిక్టరు స్కేలుపై భూకంపం తీవ్రత 6.3గా నమోదైనట్లు వెల్లడించింది.  భూమికి 32 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది. 
 
అయితే, ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి సమాచారం తెలియరాలేదు. జపాన్‌ రాజధాని టోక్యోలో కూడా ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. కాగా, తైవాన్‌లో బుధవారం ఉదయం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.  అనంతరం అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే చైనా, జపాన్‌లలో ప్రకంపనలు రావడంతో ఆందోళనలు నెలకొన్నాయి రిక్టర్‌ స్కేలుపై 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు తైవాన్‌ భూకంప పరిశీలన సంస్థ గుర్తించగా, 7.4 తీవ్రతతో నమోదైనట్టు అమెరికా జియాలాజికల్‌ సర్వే తెలిపింది. 25 ఏండ్లలో అతి పెద్ద భూకంపం ఇదే అని స్థానిక అధికారులు తెలిపారు.  హువాలియన్‌ నగరానికి నైరుతి దిశగా 18 కిలోమీటర్ల దూరంలో, 35 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. 

ఈ భూకంపం ధాటికి 10 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దాదాపు వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు అధికారులు వెల్లడించారు. 50 మందికి పైగా గల్లంతుకాగా..అందులో ఇద్దరు భారతీయులు సైతం ఉన్నారు. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.

భారీ భూకంపం తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం, ప్రకంపనలు సంభవించాయి. భూకంపం ధాటికి తైవాన్‌ రాజధాని తైపీ సహా అనేక ప్రాంతాల్లో భవనాలు బీటలు వారాయి. తైవాన్‌ భూకంపం సంభవించిన 15 నిమిషాల తర్వాత జపాన్‌లోని యొనగుని ద్వీప తీరాన్ని ఒక అడుగు ఎత్తుతో సునామీ అల తాకిందని ఆ దేశ భూకంప అధ్యయనం కేంద్రం వెల్లడించింది.