తైవాన్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

తైవాన్‌ రాజధాని తైపీని భారీ భూకంపం వణికించింది. బుధవారం తెల్లవారుజామున తైపీలో 7.5 తీవ్రతతో భూమి కపించింది. దక్షిణ తైవాన్‌లోని హులియన్‌ సిటీకి 18 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉన్నట్లు యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే  తెలిపింది. భూఅంతర్భాగంలో 34.8 కిలోమీటర్ల లోతులు కదలికలు సంభావించాయని వెల్లడించింది.
 
బుధవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో 7.5 తీవ్రతతో భూమి కంపించింది. ఆ తర్వాత 6.5 తీవ్రతతో మరో భూకంపం కూడా సంభవించినట్లు యూఎస్‌జీఎస్‌ వెల్లడించింది. భూకంపం ధాటికి పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. తైపీలో చాలా బిల్డింగ్‌లు పేకమేడల్లా కుప్పకూలపోయాయి. పలు భవనాలకు పగుళ్లు వచ్చినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. భారీ భూకంపం కారణంగా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సుమారు వంద మంది గాయపడ్డారని తెలిపింది. తైపీలోని ఓ బిల్డింగ్‌ కూలిపోతున్న వీడియో వైరల్‌గా మారింది.  
 
1999 తర్వాత తైవాన్‌ను ప్రభావితం చేసిన అతిపెద్ద భూకంపం ఇదేనని స్థానిక అధికారులు వెల్లడించారు. అప్పుడు నాంటౌ కౌంటీలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఆ భూకంపం ధాటికి సుమారుగా 2,500 మందికి పైగా మరణించారు. 1,300 మందికి పైగా గాయపడ్డారు. ఆ తర్వాత 25 ఏండ్లలో తైవాన్‌ను తాకిన బలమైన భూకంపం ఇదే అని అధికారులు తెలిపారు.  
 
తైవాన్‌లో భూకంపంతో జపాన్‌ సహా మరికొన్ని దేశాల్లోని తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీచేశారు. జపాన్‌లోని దీవులకు సుమారు 3 మీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడి సునామీ వచ్చే అవకాశం ఉందని వాతావరణ సంస్థ అంచనా వేసింది.  దాదాపు 30 నిమిషాల తర్వాత సునామీ మొదటి అల ఇప్పటికే దక్షిణ దీవులైన మియాకో, యాయామా దీవుల తీరాలను తాకినట్లు జపాన్ పేర్కొంది. సునామీ వస్తున్నదని, అందరూ ఇండ్లు ఖాళీ చేయాలని జపనీస్‌ జాతీయ వార్తాసంస్థ ఎన్‌హెచ్‌కే ప్రసారం చేస్తున్నది.
 
తైవాన్‌ పొరుగునే ఉన్న దక్షిణ జపాన్ ద్వీప సముదాయాలు, ఫిలిప్పీన్స్‌లపైనా పడింది. భూకంప తీవ్రతకు సముద్రంలో అలలు పోటెత్తాయి. మూడు నుంచి అయిదు మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. తైవాన్ సమీపంలో ఉన్న దక్షిణ జపాన్ ద్వీప సముదాయాలు అల్లాడిపోయాయి. యొనగుని, ఇషిగాకీ, తరమ, మియాకోజిమా ప్రీఫెక్షర్స్‌ తీరాల్లో అలలు పోటెత్తాయి. అయిదు మీటర్ల వరకు అలలు ఎగిసిపడినట్లు జపాన్ న్యూస్ అవుట్‌లెట్ ఎన్‌హెచ్‌కే తెలిపింది. సునామీ హెచ్చరికలను జారీ చేసినట్లు వివరించింది. ముందు జాగ్రత్త చర్యగా తీర ప్రాంతం మొత్తాన్నీ అధికారులు ఖాళీ చేయించారు.
 
కాగా, తైవాన్‌లో భూకంపాలు తరచూ వస్తుంటాయి. 1996లో 7.6 తీవ్రతతో సంభవించిన భూకంపంలో 2400 మంది ప్రజలు మరణించారు. ఇక జపాన్‌లో ప్రతిఏటా సుమారు 1500 భూకంపాలు వస్తుంటాయి.