3 నెలల్లో పాక్‌లో 245 ఉగ్ర దాడులు

పాకిస్తాన్‌లో ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో 245 ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యలు చోటు చేసుకున్నాయని, పౌరులు, భద్రత సిబ్బంది, రెబెల్స్ 432 మంది మరణించారని, 370 మంది గాయపడ్డారని ఒక మేధోవర్గం నివేదిక వెల్లడించింది.  పరిశోధన, భద్రత అధ్యయనాల కేంద్రం (సిఆర్‌ఎస్‌ఎస్) విడుదల చేసిన భద్రత నివేదిక ప్రకారం, ఆ కాలంలో మరణాలలో 92 శాతం పైగా, దాడుల్లో (ఉగ్రవాద ఘటనలు, భద్రత దళాల చర్యలతో సహా) 86 శాతం ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దులోని ఖైబర్ ఫఖ్తూన్‌ఖ్వా (కెపి) బలోచిస్తాన్ ప్రావిన్స్‌లలో చోటు చేసుకున్నాయి. 

పరిశోధన, భద్రతా అధ్యయన కేంద్రం (సిఆర్ఎస్ఎస్) విడుదల చేసిన భద్రతా నివేదిక ప్రకారం ఈ ఏడాది తొలి మూడు నెలల్లో కెపిలో 51 శాతం మరణాలు, బలోచిస్తాన్‌ల 41 శాతం మరణాలు సంభవించాయి. తక్కిన ప్రాంతాలు ఒకింత ప్రశాంతంగా ఉన్నాయని, అక్కడ మరణాలు 8 శాతం లోపే ఉన్నాయని డేటా సూచిస్తోంది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉగ్రవాదం వల్ల మొత్తం మరణాలలో 20 శాతం కన్నా తక్కువ వాటికి తమదే బాధ్యత అని తీవ్రవాద సంస్థలు చెప్పుకోవడం గమనార్హం. 

గుల్ బహదూర్ గ్రూప్‌నకు అనుబంధితమైన జభత్ అన్సార్ అల్ మహ్ది ఖొరాసన్ (జెఎఎంకె) అనే కొత్త తీవ్రవాద వర్గం ఆవిర్భవించింది. ఉగ్ర దాడులు, ఉగ్రవాద నిరోధక చర్యల వల్ల మరణాలకు అదనంగా ప్రభుత్వ, రాజకీయ నాయకులు, ప్రైవేట్, భద్రత సంస్థల ఆస్తులు లక్షంగా పాకిస్తాన్‌లో 64 విధ్వంసక సంఘటనలు చోటు చేసుకున్నాయి.

మొదటి త్రైమాసికంలో, బలూచిస్తాన్ హింసాత్మక ఘటనలు 96 శాతం పెరుగుదల నమోదయ్యాయి. 2023 చివరి త్రైమాసికంలో మరణాలు 91 నుండి 178కి పెరిగాయి. సింధ్ హింసలో దాదాపు 47 శాతం పెరుగుదల కనిపించింది, అయితే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. అయినప్పటికీ,  ఖైబర్ పఖ్తున్ఖ్వా పంజాబ్, గిల్గిట్- బాల్టిస్తాన్(జిబి) ప్రాంతాలలో హింసాత్మకంగా వరుసగా 24 శాతం, 85 శాతం, 65 శాతం తగ్గుదల ప్రోత్సాహకరంగా నమోదైంది.

ఈ కాలంలో జిబిలో హింసలో గణనీయమైన తగ్గుదల కనిపించినప్పటికీ, నిషేధిత తెహ్రీక్-ఇ- తాలిబాన్ పాకిస్థాన్ (టిటిపి) ద్వారా దాడులు జరిగే అవకాశంపై జిబి హోం మంత్రి మార్చి 31, 2024న తీవ్రవాద ముప్పు హెచ్చరికను జారీ చేశారు.
 
దాసు డ్యామ్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్న కెపిలోని షాంగ్లా జిల్లాలో చైనీస్ ఇంజనీర్ల కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగిన తరువాత ఈ హెచ్చరిక చేశారు. ఫలితంగా ఐదుగురు చైనా జాతీయులు, స్థానిక డ్రైవర్ మరణించారు. గత సంవత్సరం, జిబి ఒక దశాబ్దంలో అత్యధిక మరణాలను చవిచూసింది. 17 మంది ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.