తమిళనాడులోని ఐదుగురు కలెక్టర్లకు సుప్రీంకోర్టు మందలింపు

తమిళనాడులోని ఐదు జిల్లాల కలెక్టర్లను సుప్రీంకోర్టు మందలించింది. అక్రమ మైనింగ్‌ కేసులో ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లు ఈడీ ఎదుట హాజరుకాలేదు. దాంతో సుప్రీంకోర్టు మందలించింది. ఐదుగురు అధికారులు ఈ నెల 25న ఈడీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 
 
ఈ మేరకు జస్టిస్‌ బేలా ఎం త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అధికారులపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది.  అధికారులకు న్యాయస్థానం, చట్టం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ఈ మనస్తత్వం అధికారులను క్లిష్ట పరిస్థితుల్లోకి నెడుతుందని పేర్కొంది.
 
సమన్లపై ఈడీ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పుడు హాజరుకావాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. తమిళనాడు ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాదులు కపిల్‌ సిబల్‌, అమిత్‌ ఆనంద్‌ త్రివేది విచారణకు హాజరయ్యారు. అధికారులు శాంతిభద్రతలు, సామాజిక భద్రతా పథకాల్లో బిజీగా ఉన్నారని కోర్టుకు తెలిపారు. 
 
స్పందించిన కోర్టు ఈడీ ఎదుట హాజరుకావాలని, హాజరుకాకపోవడానికి కారణాలు చెప్పాలని చెప్పింది. ఈడీ ఎదుట హాజరయ్యేందుకు చివరి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. వాస్తవానికి వేలూరు, తిరుచిరాపల్లి, కరూర్‌, తంజావూర్‌, అరియలూరు జిల్లాల కలెక్టర్లను ఈడీ విచారణకు పిలిచింది. గత ఏడాది నవంబర్ 28న మద్రాస్ హైకోర్టు ఈడీ సమన్లపై స్టే విధించింది.
 
దాంతో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఫిబ్రవరి 27న హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాలని ఐదుగురు జిల్లా మెజిస్ట్రేట్లకు ఆదేశాలు ఇచ్చింది.