బీజాపూర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు హతం

ఈ సంవత్సరం దేశంలోనే ఓ భారీ ఎన్‌కౌంటర్‌ ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. మంగళవారం ఉదయం బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు.
 
తలపై రూ. 40 లక్షలకు పైగా రివార్డ్ ను ప్రభుత్వం ప్రకటించిన పాపారావు అనే సీనియర్ మావోయిస్టు ఉన్నట్లు తమకు అందిన సమాచారం మేరకు ఈ ఆపరేషన్ జరిగిందని బస్తర్ ఐజీ సుందర్‌రాజ్ తెలిపారు.  ఉదయం 6 గంటల ప్రాంతంలో లేంద్ర గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో జిల్లా రిజర్వ్ గార్డ్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ , కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా)కి చెందిన సిబ్బంది సంయుక్త ఆపరేషన్‌ చేపట్టారు. ఆ సమయంలో భద్రతా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. 
 
ఈ క్రమంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన మందుపాతరలు, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.


బస్తర్ ప్రాంతంలో ఉన్న బీజాపూర్ మావోయిస్టు కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో దాదాపు 41 మంది నక్సలైట్లు మరణించారని పోలీసులు తెలిపారు.  బీజాపూర్‌ ఎస్‌పి ఏ.వైష్ణవ్‌ తెలిపిన వివరాల ప్రకారం గంగలూరు అటవీ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, జిల్లా పోలీస్‌ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌ చేపట్టినట్లు తెలిపారు. 

 
ఈ క్రమంలో మావోయిస్టులు అడవిలో పొంచి ఉండి పోలీసులపై కాల్పులకు తెగబడ్డారని తెలిపారు. భద్రతా బలగాలు దాడిని తిప్పి కొట్టి.. కాల్పులు జరపడంతో తొమ్మిది మంది మావోయిస్టు మృతి చెందారని తెలిపారు. వారిని గుర్తించాల్సి ఉందని పేర్కొన్నారు.  ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా సిబ్బంది తేలికపాటి మెషిన్ గన్, ఇతర ఆయుధాలతో సహా అనేక ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.