సుప్రీంకోర్టుకు క్ష‌మాప‌ణ‌లు చెప్పిన బాబా రాందేవ్‌

ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల గురించి త‌ప్పుడు యాడ్స్ ఇచ్చిన కేసులో యోగా గురువు బాబా రాందేవ్ మంగళవారం సుప్రీంకోర్టు ముందు క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఆ కేసులో ప్ర‌త్య‌క్షంగా ఇవాళ ఆయ‌న కోర్టుకు హాజ‌ర‌య్యారు. రాందేవ్‌, బాల‌కృష్ణ‌లు వ్య‌క్తిగ‌తం హాజ‌రు కావాల‌ని కోర్టు ఆదేశించింద‌ని, ఆ ఆదేశాల ప్ర‌కారం ఆ ఇద్ద‌రూ కోర్టుకు వ‌చ్చిన‌ట్లు వాళ్ల త‌ర‌పు న్యాయ‌వాది వెల్ల‌డించారు.

 ఇండియ‌న్ మెడిక‌ల్ అసోసియేష‌న్ దాఖ‌లు చేసిన కేసులో రాందేవ్ బాబా క్షమాప‌ణ‌లు తెలిపారు. పతంజలి ఆయుర్వేద సంస్థ ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. ఈ కేసు విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ఈ పద్ధతి తగదంటూ పతంజలి సంస్థను మందలించింది. 
 
ఇకపై అసత్య ప్రకటనలు ఇవ్వరాదని ఆదేశించింది. అయినా ఆ హామీని ఉల్లంఘించారు. దీంతో వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలంటూ సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థ పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొంటూ పతంజలి సంస్థ క్షమాపణలు తెలియజేసింది. తాజాగా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.

క్షమాపణలు తెలియజేస్తూ రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ దాఖలు చేసిన అఫిడవిట్ పై వ్యాఖ్యానిస్తూ వారి క్షమాపణలపట్ల తాము సంతృప్తి చెందలేదని కోర్టు పేర్కొంది. దీంతో కోర్టుకు వ్యక్తిగతంగా వచ్చి క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్లు రామ్ దేవ్ బాబా, బాలకృష్ణ కోర్టుకు తెలియజేశారు. జ‌స్టిస్ హిమా కోహ్లీ, అషానుద్దిన్ అమానుల్లాల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసును విచారించింది. వారం రోజుల్లోగా మెడిక‌ల్ యాడ్స్ కేసులో కొత్త అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని బాబా రాందేవ్‌, బాల‌కృష్ణ‌లకు సుప్రీంకోర్టు అనుమ‌తి ఇచ్చింది.