రూ.500 కోట్లతో కేంద్రం ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీ

దేశంలో విద్యుత్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహానికి ప్రభుత్వం రూ.500 కోట్లతో కొత్త పథకానికి శ్రీకారం చుట్టుంది. ఈ ప్రత్యేక పధకం నాలుగు నెలల పాటు అందుబాటులో ఉండనుంది. విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు  నరేంద్ర మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ రూ.500 కోట్ల ప్రధకం ఏప్రిల్ 1, 2024 సోమవారం నుంచే అమలులోకి వచ్చింది.

ఈ పధకం2024, జులై 31 వరకు అంటే నాలుగు నెలల పాటు అమలులో ఉంటుంది. మరోవైపు ఇప్పటి వరకు అమలులో ఉన్న రెండో విడత ఫేమ్ (ఫాస్టర్ అడాప్షన్ అండ్ మాన్యుఫాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇన్ ఇండియా) ఫేమ్-2 ప్రోగ్రామ్ మార్చి 31, 2024తో ముగిసింది. ఈ క్రమంలోనే కొత్త పథకాన్ని ప్రారంభించడం ఎలక్ట్రిక్ బైక్స్, స్కూటర్స్, త్రీవీలర్స్ , కార్లు కొనుగోలు చేసే వారికి భారీ ఊరట లభించిందని చెప్పవచ్చు.

ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 (ఐఎంపిఎస్ 2024)ను భారీ పరిశ్రమలమంత్రిత్వ శాఖ అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసిన వారికి రూ.10 వేల వరకు రాయితీ అందిస్తోంది. మొత్తంగా 3.33 లక్షల ఎలక్ట్రిక్ టూ వీలర్లకు ఈ రాయితీ అందించాలని కేంద్రం భావిస్తోంది.

ఆ తర్వాత చిన్న సైజ్ లోని త్రీ వీలర్లు ఇ-రిక్షా, ఇ-కార్ట్స్ కి రూ.25 వేల వరకు సబ్సిడీ లభించనుంది. 41 వేల త్రీవీలర్లకు ప్రోత్సాహకాలు అందించనుంది కేంద్రం. ఆ తర్వాత పెద్ద త్రీ వీలర్లకు రూ.50 వేల వరకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది.  ఆఫ్ టూ వీలర్స్, త్రీ వీలర్స్ ఫాస్టర్ అడాప్షన్ ద్వారా దేశంలో ఈవీల తయారీని ప్రోత్సహించడం, గ్రీన్ మొబిలిటీని పెంచడమే లక్ష్యంగా ఈ పథకాన్ని మార్చి 13నే ప్రకటించింది భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ. 
 
ఈ పథకం ముఖ్య ఉద్దేశం 3,72,215 ఎలక్ట్రిక్ వాహనాలకు రాయితీలు కల్పించడం. అలాగే అధునాతన సాంకేతికతను ప్రోత్సహించడం. అడ్వాన్స్డ్ బ్యాటరీలను అందించే వాహనాలకు మాత్రమే ఈ పథకం కింద ప్రోత్సాహకాలు లభించనున్నాయని భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. 
 
కేంద్ర ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా ఈఎంపీఎస్ 2024 దేశంలో సమర్థవంతమైన, పోటీతత్వ, దృఢమైన ఈవీల తయారీ పరిశ్రమను ప్రోత్సహిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రయోజనం కోసం దేశీయ తయారీ, ఈవీ సరఫరాను బలోపేతం చేసే విధంగా దశల వారీ తయారీ కార్యక్రమానికి ఆమోదం తెలిపినట్లు పేర్కొంది.