కేజ్రీవాల్‌ కు15 రోజులు జ్యుడీషియల్‌ రిమాండ్‌

మద్యం పాలసీ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌కు కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. లిక్కర్‌స్కామ్‌లో 15 రోజుల పాటు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ సోమవారం ఉదయం తీర్పు వెలువరించింది.

ఈ కేసులో మార్చి 22న కేజ్రీవాల్‌ను అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రౌస్ అవెన్యూ కోర్టు ఆయనకు వారం రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ గడువు మార్చి 28న ముగియడంతో కోర్టులో హాజరుపరుచగా ఢిల్లీ సీఎంకు మరో మూడు రోజులు కస్టడీ విధించింది. కోర్టు విధించి ఈడీ కస్టడీ నేటితో ముగిసింది. దీంతో అధికారులు ఆయనను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. భారీ భ‌ద్రత మ‌ధ్య ఆయ‌న్ను కోర్టుకు తీసుకువ‌చ్చారు.

స్పెష‌ల్ జ‌డ్జి కావేరి బ‌వేజా ముందు ఆయనను హాజరు పరిచారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు రిమాండ్‌ విధించింది. ఏప్రిల్‌ 15 వరకూ జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధిస్తూ తీర్పు వెలువరించింది. ఢిల్లీ సీఎంను తీహార్‌ జైలుకు పంపాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా ఈడీ తరఫున వాదనలు వినిపించిన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజు.. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించలేదని, దర్యాప్తును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఆయన డిజిటల్ పరికరాల పాస్‌వర్డ్‌లను చెప్పడం లేదని ఆరోపించారు. ప్రస్తుతం ఈడీ కస్టడీ పొడిగింపు కోరడం లేదన్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ కస్టడీలోకి తీసుకుంటామని, అప్పటి వరకూ జ్యుడిషియల్‌ కస్టడీకి అప్పగించాలని కోరారు.

 కోర్టుకు తీసుకువ‌స్తున్న స‌మ‌యంలో రిపోర్టర్లు కేజ్రీని ప్రశ్నించారు. ప్రధాని మోదీ చేస్తోంది దేశానికి మంచిది కాదు అని కేజ్రీవాల్ ఈ సందర్భంగా తెలిపారు. అయితే, తనను అక్రమంగా అరెస్ట్ చేశారంటూ ఇప్పటికే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్ పిటిషన్‌ మంగళవారం విచారణకు రానుంది. ఈ కేసులో ఇప్పటికే ఆప్‌ నేతలు మనీశ్‌ సిసోడియా, సంజయ్‌ సింగ్‌, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితలు అరెస్ట్ కాగా.. వారంతా తిహార్ జైల్లో ఉన్నారు.

తాజాగా ఆయన కస్టడీని ఏప్రిల్ 15వ తేదీ వరకూ రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించడంతో ఆయనను తీహార్ జైలుకు తరలించారు. కస్టడీ గడువు వరకూ తీహార్ జైలులోని జైల్ నెంబర్-2లో ఆయన ఒక్కరే ఉంటారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన మనీష్ సిసోడియా జైల్ నెంబర్-1, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ జైల్ నెంబర్-7, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ జైల్ నెంబర్-5లో ఉంటున్నారు. బీఆర్ఎస్‌ నేత కె.కవిత తీహార్ జైలులోని జైల్ నెంబర్-6 (మహిళా జైలు)లో ఉంటున్నారు.