తగ్గిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

ధరల మోతతో ఇబ్బంది పడుతున్న గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు ఉపశమనం కలిగించాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను తగ్గించాయి. 19 కేజీల సిలిండర్‌పై రూ.30.50 మేర తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. తగ్గిన ధరలు ముంబై, కోల్‌కతా, చెన్నై సహా దేశవ్యాప్తంగా నేటి నుంచి అంటే ఏప్రిల్‌ 1వ తేదీ నుంచే అమల్లోకి వస్తాయని వెల్లడించాయి. 
 
చమురు సంస్థల నిర్ణయంతో దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1,795గా ఉన్న వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ. 1,764.50కి తగ్గింది. అదేవిధంగా ముంబైలో రూ.1,749 నుంచి రూ.1,717.50కి తగ్గింది. చెన్నైలో మాత్రం 19 కేజీల సిలిండర్‌పై రూ.30 తగ్గించారు. దీంతో ప్రస్తుత ధర రూ.1,960.50 నుంచి రూ.1,930కు సిలిండర్‌ ధర తగ్గింది. అదేవిధంగా కోల్‌కతాలో రూ.1,911 ఉన్న కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.1,879కి తగ్గింది. 
 
స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా, గృహావసరాలకు వినియోగించే 14 కిలోల గ్యాస్‌ సిలిండర్‌ ధరలో మాత్రం ఎలాంటి మార్పూ లేదు. గత నెల మహిళా దినోత్సవం సందర్భంగా గృహావసరాల గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.100 తగ్గించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అదే ధర కొనసాగుతోంది.