కెసిఆర్‌కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు

రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్‌ఎస్ నేత కెసిఆర్‌కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి ఎం రఘునందన్ రావు విమర్శించారు. రెండు సార్లు అధికారం అనుభవించిన, పదేళ్ల పాటు రైతుల గురించి పట్టించుకోలేదని ఓటమి రుచి చూసిన తరువాత రైతులు సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ఎద్దేవా చేశారు. 

ఆయన పాలనలో ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను బలవంతంగా చేర్చుకుని, ఆపార్టీలను నిర్వీర్యం చేయాలని కుట్రలు చేయాలేదా? అని నిలదీశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కుమ్మక్కు అయ్యారని ఇటీవల వరుసగా కాంగ్రెస్‌లో చేరుతున్నారని ఆరోపించారు. పాలక, ప్రతిపక్ష నాయకుల నాటకాలు రాష్ట్ర ప్రజలకు పూర్తిగా అర్ధం అయిందని చెప్పారు.

లోక్‌సభ ఎన్నికల్లో రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజలను మోసే పార్టీల అడ్రస్సు గల్లంతు చేయాలని సూచించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి 14 సీట్లలో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో బిఆర్‌ఎస్ త్వరలో కనుమరుగు కాబోతోందని కీలక వ్యాఖ్యలు చేశారు. బిఆర్‌ఎస్ గ్రామ మండల స్ధాయి లీడర్లు, స్దానిక కార్యకర్తలకు వాస్తవ పరిస్థితులను వివరించి, కమలం పార్టీలోకి ఆహ్వానించాలని ఆపార్టీ నేతలకు సూచించారు. 

కేంద్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది నరేంద్రమోడీ ప్రభుత్వమేనని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం 9 సంవత్సరాల నుంచి చేస్తున్న అభివృద్ధి పనుల గురించి తెలియజేయాలన్నారు. కార్యకర్తలంతా విభేదాలు వీడి ఐక్యంగా పనిచేయాలని కోరారు.