కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో రైతులు

శాసనసభ ఎన్నికల్లో అనేక వాగ్దానాలు రైతులకు ఇచ్చి నిండా ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణాలో రైతులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి తెలిపారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పదాధికారులు కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు .
 
ప్రధానంగా రెండు లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణమాఫీ హామీ చేస్తానని ఎన్నికలకు ముందుమాట ఇచ్చి రేవంత్ రెడ్డి మాట తప్పారని, రైతు భరోసా మాటే మరిచారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధరలను పెంచడంతోపాటు కిసాన్ సమ్మణ్ నిది ద్వారా రైతులకు దేశవ్యాప్తంగా రూ. 6000 సహకారం అందిస్తున్నారని తెలిపారు. 
 
నరేంద్ర మోదీ రైతుల ప్రధానిగా చరిత్రలో నిలిచిపోతారని చెబుతూ తెలంగాణలో కిసాన్ మోర్చా గ్రామస్థాయిలో పర్యటించి రైతు జాగరణ చేయాలని కిషన్ రెడ్డి కిసాన్ మోర్చా శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ఈనెల 5వ తేదీన అన్ని జిల్లా కేంద్రాలలో బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ చేపట్టనున్న రైతు సత్యాగ్రహం కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు.
 
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ సీట్లు బిజెపి గెలిచేందుకు బిజెపి కిసాన్ మోర్చా శ్రేణులు సైనికుల్లా పనిచేయాలని కోరారు.  బిజెపి రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్,డి పాపయ్య గౌడ్ పాల్గొన్నారు.