ఏపీలో ముగ్గురు కలెక్టర్లు, ఐజీ, ఐదుగురు ఎస్పీలపై బదిలీ వేటు

ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో సంచలన ఆదేశాలు ప్రకటిస్తున్న ఎన్నికల కమిషన్  మంగళవారం మరో సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో ఏకంగా ఓ ఐజీ, ఐదు జిల్లాల ఎస్పీలతో పాటు మూడు జిల్లాల కలెక్టర్లపై బదిలీ వేటు వేసింది. ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలో ఎన్నికల నేపథ్యంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరందరినీ విపక్షాల ఫిర్యాదులతో బదిలీ చేసినట్లు తెలుస్తోంది.
 
కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన వారిలో ప్రకాశం, పల్నాడు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు ఎస్పీలు ఉన్నారు. వీరిని వెంటనే బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ ఆదేశాలు ఇచ్చింది. ఎన్నికలతో సంబంధం లేని పోస్టుల్లోకి బదిలీ చేయాలని రాష్ట్ర సీఇఓ కు ఆదేశాలు పంపింది. ఎన్నికల కమీషన్ ఆదేశాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపిలకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా పంపారు.
 
బదిలీ అయిన అధికారులు ఎన్నికలు పూర్తయ్యే వరకూ విధుల్లో ఉండకూడదని ఆదేశించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల్లోపు బదిలీ అయిన వారి స్థానంలో కొత్తవారి భర్తీకి ముగ్గురు ఆఫీసర్లతో ప్యానల్ పంపాలని ఈసీ ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
 
బదిలీ వేటు పడిన వారిలో చిత్తూరు ఎస్పీ జాషువా, ప్రకాశం ఎస్పీ పరమేశ్వరరెడ్డి, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వరరెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, అనంతపురం ఎస్పీ అంబురాజన్ ఉన్నారు. వీరితో పాటు గుంటూరు రేంజ్ ఐజీ పాల్ రాజ్ కూడా ఉన్నారు. రాష్ట్ర సీఇఓ ఇచ్చిన నివేదిక, ప్రతిపక్షాల ఫిర్యాదు మేరకు ఎస్పీలపై బదిలీ వేటు వేస్తున్నట్లు ఈసీ తెలిపింది.

మరోవైపు మరో మూడు జిల్లాల కలెక్టర్లపైనా ఈసీ బదిలీ వేటు వేసింది. కృష్ణా జిల్లా -పి రాజాబాబు, అనంతపురం కలెక్టర్ ఎం గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాలపై బదిలీ వేటు పడింది. ఈ ముగ్గురిని తక్షణం బదిలీ చేయాలని సీఈవోకు ఆదేశాలు రావడంతో సీఎస్ కు తదుపరి ఉత్తర్వుల కోసం పంపారు.

 
టీడీపీ,బీజేపీ, జనసేనల మధ్య పొత్తు కురిదిన తర్వాత ప్రజాగళం పేరిట చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించాయి. ఈ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అయితే ఈ సభకు పోలీసులు తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేదని బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు ఆరోపించారు. పోలీసుల నిర్లక్ష్యం కారణంగా సభలో తరచూ అవాంతరాలు ఏర్పడ్డాయని ఈ మూడు పార్టీల నేతలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. 
 
దీంతో పాటు పలువురు పోలీసులు, ఎన్నికల అధికారులు అధికార వైసీపీ మద్దతుగా వ్యవహరిస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ ఘటనలపై విచారించిన ఎన్నికల సంఘం బాధ్యులపై చర్యలు తీసుకుంది.