ఫిలిబిత్‌ ప్రజలతో సంబంధం రాజకీయాలకతీతం

ఫిలిభిత్‌ ఎంపీ వ‌రుణ్ గాంధీ రానున్న‌ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ టికెట్ నిరాకరించడంతో నియోజకవర్గ పిలిభిత్‌ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి ఓ లేఖ రాశారు. ఫిలిబిత్‌తో త‌న సంబంధం రాజ‌కీయాల‌కు అతీత‌మైంద‌ని, పిలిభిత్ బిడ్డ‌నైన తాను ప్ర‌జ‌ల కోసం ఎంత‌టి మూల్యాన్ని చెల్లించేందుకూ సిద్ధ‌మ‌ని ఆ లేఖలో ప్ర‌క‌టించారు. సామాన్యుడి గొంతు వినిపించేందుకే తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని, ప్ర‌జ‌ల కోసం త‌న ఇంటి త‌లుపులు ఎప్పుడూ తెరిచేఉంటాయ‌ని వరుసగా రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన ఆయన స్ప‌ష్టం చేశారు.

ఇవాళ తాను ప్ర‌జ‌ల కోసం చేసే ప‌నుల‌ను కొన‌సాగించేందుకు వారి ఆశీస్సులు కోరుతున్నాన‌ని చెప్పారు. తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో  రాసిన లేఖలో  ”ఎంపిగా నా పదవీకాలం ముగింపు దశకు వస్తోంది. అయినా పిల్‌భిత్‌ ప్రజలతో నా సంబంధం చివరి శ్వాస వరకు కొనసాగుతుంది. ఎంపి పదవి లేకపోయినా, కొడుకుగా జీవితాంతం మీకు సేవ చేసేందుకు కట్టుబడి ఉంటాను. నా ఆలోచనలు ఎప్పుడూ మీతోనే ఉంటాయి” అని తెలిపారు.

 1983లో మూడేండ్ల వ‌య‌సులో తాను త‌ల్లి వేలు ప‌ట్టుకుని పిలిభిత్  గ‌డ్డ‌పై అడుగుపెట్టాన‌ని, ఇప్పుడు ఇదే త‌న కార్య‌స్ధ‌ల‌మైంద‌ని, ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌న కుటుంబంలో భాగ‌మ‌య్యార‌ని, ఈ విష‌యాల‌న్నీ త‌న‌కు గుర్తుకువ‌స్తున్నాయ‌ని లేఖ‌లో పేర్కొన్నారు.

మీ ప్ర‌తినిధిగా లోక్‌స‌భ కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం త‌న జీవితంలో పొందిన అత్యున్న‌త గౌర‌వ‌మ‌ని పేర్కొంటూ ఎంపీగా త‌న ప‌ద‌వీ కాలం ముగియ‌నున్నా, పిలిభిత్ ప్ర‌జ‌ల‌తో త‌న అనుబంధం తుదిశ్వాస వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని థెయ్ల్పారు. ఎంపీగా కాకున్నా ఈ ప్రాంత ప్ర‌జ‌ల కోసం తాను జీవితాంతం ప‌నిచేస్తూనే ఉంటాన‌ని, మీ కోసం త‌న ఇంటి త‌లుపులు గ‌తంలో మాదిరిగా ఎప్పుడూ తెరిచేఉంటాయ‌ని స్పష్టం చేశారు.

సొంతపార్టీపైనే విమర్శలు ఎక్కుపెట్టడంతో ఈ సారి వరుణ్‌గాంధీకి బిజెపి టికెట్‌ నిరాకరించింది. ఉత్తరప్రదేశ్‌ మంత్రి, కాంగ్రెస్‌ నుండి బిజెపిలో చేరిన జితిన్ ప్ర‌సాద‌కు టికెట్ కేటాయించింది.