ఈడీ దాడులతో ప్రజలలో మార్పు రాకూడదు

పోలీసులు లేదా ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) దాడుల వల్ల ప్రజల ప్రవర్తనలో మార్పు రాకూడదని, హృదయపూర్వకంగా, మనస్సాక్షితో జరగాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్  సంఘచాలక్ డా. మోహన్ భగవత్ తెలిపారు.
 
“సామాజికంగా అప్రమత్తంగా, క్రమశిక్షణతో కూడిన, సంస్కారవంతమైన, ప్రగతిశీల సమాజాన్ని” నిర్మించడానికి కృషిచేస్తున్న ముంబైకి చెందిన సంస్థ లోకమాన్య సేవా సంఘ్ 101వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ “సంస్థలు సామాజిక పరివర్తనను నిర్ధారించడానికి వివిధ విషయాలను ఎంచుకోవాలి. వాటిలో కొన్నింటిని నేను జాబితా చేసాను” అని చెప్పారు.
 
 పోలీసులు వీధిలో నిలబడటం వల్ల లేదా ఈడీ దాడులను నివారించడం వల్ల కూడా ప్రవర్తనలో మార్పు జరగవచ్చని, కానీ అటువంటి మార్పు మనకు అవసరంలేదని స్పష్టం చేశారు.  మార్పు మన మనసునుండి రావాలని,  ఆ మార్పును మన హృదయం అంగీకరించాలని ఆయన తెలిపారు.  “ఇది మరొకరు చేయడం వల్ల సాధ్యం కాదు. మనస్సాక్షితో జరగాలి. సమాజంలో ఇలాంటి సంస్కరణలను ప్రవేశపెట్టడం ప్రతి సంస్థ బాధ్యతగా భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. భద్రత లేని దేశం పురోగమించదని డా. భగవత్ చెప్పారు.
 
“దండయాత్ర జరిగినప్పుడు పురోగతి ఎప్పుడూ జరగదు. భద్రత సమకూరినప్పుడే పురోగతి జరుగుతుంది. మనం మరింత స్వావలంబనగా మారితే మన దేశం సురక్షితమైనదిగా మారుతుంది. ప్రజలు ప్రాథమిక నియమాలను అనుసరించినప్పుడు, సిగ్నల్ జంప్ చేయనప్పుడు దేశం సురక్షితంగా మారుతుంది, ”అని ఆయన వివరించారు.
 
 దేశాన్ని నడిపించడం చాలా పెద్ద బాధ్యత అని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ తెలిపారు. ఇది ఎవరికీ ఇచ్చే కాంట్రాక్ట్ కాదు.. బృహత్తర బాధ్యత. మంచి వ్యక్తిగా ఎదగడం అంటే సివిక్ సెన్స్ ఉండాలి. ఆర్‌ఎస్‌ఎస్‌లోని మేము ఇప్పుడు మన కార్యకర్తలను సివిక్ సెన్స్‌కు ఉదాహరణగా సమాజానికి అందించాలని ఆలోచిస్తున్నాం” అని చెప్పారు.
 
లోకమాన్య బాలగంగాధర్ తిలక్ కాలంలో సమాజంలో అనేక సంస్థలు ఉండేవని, అవి సామాజిక సంస్కరణలు, స్వాతంత్ర్యం అనే రెండు అంశాలలో ఎవ్వరికీ వారుగా పనిచేస్తూ ఉండేవని డా. భగవత్ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా సమాజంలోని సంస్థలు ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకురావడానికి ఇలాంటి పనులను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
 
“సామాన్యుడు గొప్పగా ఉన్న దేశం గొప్ప దేశం. కాబట్టి, సామాజిక స్థాయిలో సంస్కరణలు అవసరం. ఒక దేశం ఎదుగుదల, పతనం సమాజపు ఆలోచనా విధానం, విలువలతో ముడిపడి ఉన్నాయి,” అని ఆయన తెలిపారు. 1925లో ఆర్‌ఎస్‌ఎస్‌ని స్థాపించిన డా. హెడ్గేవార్‌కు లోకమాన్య తిలక్ తన తొలి సామాజిక జీవితంలో స్ఫూర్తినిచ్చారని చెప్పారు.
 
రెండవ ప్రపంచ యుద్ధ కాలం నుండి బ్రిటన్ మాజీ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఉదాహరణను ఉటంకిస్తూ,  జర్మనీ ముందు లొంగిపోవడానికి దాదాపు సిద్ధంగా ఉన్నానని, అయితే తాను ప్రజల మాటలను విన్నానని, వారు పోరాడటానికి సిద్ధంగా ఉన్నారని గ్రహించారని ఆయన గుర్తు చేశారు.
 
“చర్చిల్ బ్రిటీష్ పార్లమెంటులో తన అత్యంత ప్రసిద్ధ ప్రసంగం చేశాడు. అతను  ప్రజల మనోధైర్యాన్ని పెంచాడు. ఇంగ్లాండ్ తరువాత యుద్ధంలో గెలిచింది. అతను ఇంగ్లండ్ ప్రజలకు ఆ క్రెడిట్ ఇచ్చాడు. యుద్ధ సమయంలో వారి తరపున గర్జించానని, అయితే ప్రజలే నిజమైన సింహాలు అని చెప్పాడు” అని డా. భగవత్ వివరించారు. 
 
సామాజిక పరివర్తనలో ప్రతి వ్యక్తి కీలక పాత్ర పోషిస్తారని ఆయన స్పష్టం చేశారు. అత్యంత భౌతికవాద జీవనశైలి సమాజాన్ని ఆక్రమించిందని, కుటుంబ బంధాలను ప్రభావితం చేస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “చాలా సంవత్సరాలుగా తీవ్ర భౌతికవాద అభిప్రాయాలు దేశంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. కుటుంబాలు న్యూక్లియర్‌గా మారాయి. అహంకారాన్ని నియంత్రించే వారెవ్వరూ లేరు” అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
 
“ఉన్నత చదువులు, సంపాదన ఉన్న కుటుంబాలు అయోమయానికి గురవుతున్నాయని చెప్పడానికి చింతిస్తున్నాను. తక్కువ సంపాదించే వారిలో అలాంటి దృశ్యం కనిపించదు. మన సమాజం, మన కుటుంబాలకు మంచి బంధం అవసరం, ” అని స్పష్టం చేశారు. కొత్త తరానికి శివాజీ మహారాజ్, మహారాణా ప్రతాప్ గురించి తెలియదని డా. భగవత్ విచారం వ్యక్తం చేశారు.