కేజ్రీవాల్ అరెస్ట్ పై అమెరికా వ్యాఖ్యలపై భారత్ ఆగ్రహం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై అమెరికా విదేశాంగ శాఖ చేసిన వాఖ్యలపై భారత్ ఆగ్రహం ప్రకటించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం ఓ ప్రకటనలో కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా వ్యాఖ్యలు ఆమోదించలేనివని, అసమంజసమైనవని పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవహారంలో ఆ దేశ దౌత్యవేత్తకు భారత్ సమన్లు పంపింది.

 బుధవారం అమెరికా తాత్కాలిక డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ గ్లోరియా బెర్బెనాను . భారత విదేశీ వ్యవహారాల కార్యాలయానికి పిలిపించుకొని 40 నిమిషాల పాటు చర్చించినట్లు తెలుస్తోంది.

“ఒక దేశానికి సంబంధించి ఎన్నికలు, చట్టపరమైన ప్రక్రియలపై ఆరోపణలు ఆమోదయోగ్యం కాదు. భారత్‌లో చట్టపరమైన ప్రక్రియలు చట్టబద్ధమైన పాలనతోనే నడుస్తాయి. ఇందులో ఏ దేశం జోక్యం అక్కర్లేదు” అని ఎంఈఏ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో  కేజ్రీవాల్ అరెస్టుకు సంబంధించిన నివేదికలను తమ ప్రభుత్వం నిశితంగా పర్యవేక్షిస్తోందని యూఎస్ తెలిపింది. ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణ జరుగుతుందని ఆశిస్తున్నామని అని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

అంతకు ముందు కేజ్రీవాల్‌ అరెస్ట్‌పై జర్మనీ విదేశాంగ శాఖ విడుదల చేసిన ప్రకటన కూడా దుమారం రేపింది. కేజ్రీవాల్‌ విచారణ పారదర్శకంగా జరగాలంటూ జర్మనీ కామెంట్స్ చేసింది. దీనిపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మనీ దేశ రాయబారికి కూడా సమన్లు పంపింది. దేశ అంతర్గత విషయాల్లో ఇతరుల జోక్యం అవసరం లేదని భారత్ స్పష్టం చేసింది.