కాంగ్రెస్ లోకి కేశవరావు, కడియం శ్రీహరి

అధికారం కోల్పోయిన బిఆర్ఎస్ నుండి వరుసగా నేతలు నిష్క్రమిస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్, బిజెపిలలో చేరగా తాజాగా ఇద్దరు సీనియర్ నేతలు తమ కుమార్తెలతో కలిసి పార్టీని విడవబోవడం కలకలం రేపుతోంది. పార్టీలో సీనియర్ నేతగా, కేసీఆర్ కు సన్నిహితుడిగా పేరొందిన వృద్ధనేత డా. కె కేశవరావు, తన కుమార్తె, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి కాంగ్రెస్ లో శనివారం చేరేందుకు సిద్ధమయ్యారు.
 
ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసినప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆయనకు ఏమి తక్కువ చేశామని నిష్ఠూరంగా మాట్లాడారని తెలుస్తున్నది. రెండు సార్లు రాజ్యసభ సభ్యునిగా చేయడంతో పాటు, ఆయన కుమార్తెను మేయర్ గా చేశారు. గత వారం కాంగ్రెస్ తెలంగాణ ఇన్ ఛార్జ్ దీప మున్షి ఆయనను కలిసి కాంగ్రెస్ లో చేరమని ఆహ్వానించారు.
 
సుదీర్ఘ కాలం కాంగ్రెస్‌లో ఉన్నా ను. 84 ఏళ్ల వయసులో తిరిగి సొంత పార్టీకి వెళ్లానని అనుకుంటున్నాను అని కేశవరావు ప్రకటించారు.  కాంగ్రెస్ పార్టీ తనకు సొంత ఇల్లు అని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికి చేరుతారని, తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు తెలిపారు.  ఈ నెల 30 వ తేదీన కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి ప్రకటించారు. అధికార పార్టీలో ఉంటేనే పనులు అవుతాయని, సమస్యలు పరిష్కరించడం సులువని ఆమె వెల్లడించారు
 
గతంలో ఉమ్మడి రాష్ట్ర పిసిసి అధ్యక్షనిగా, కాంగ్రెస్ రాజ్యసభ సభ్యనిగా పనిచేసిన ఆయనకు ఆ పార్టీలో సీనియర్ నేతగా పేరుంది. అయితే రెండోసారి రాజ్యసభ సభ్యునిగా చేయకపోవడంతో టిఆర్ఎస్ లో చేరారు. కాగా, ఆయన కుమారుడు విప్లవ్ కుమార్ మాత్రం తాను బిఆర్ఎస్ లోనే కొనసాగుతానని చెబుతున్నారు.
 
మరోవంక, మాజీ ఉపముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్యెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె, ప్రస్తుతం వరంగల్ బిఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య కూడా కాంగ్రెస్ లో చేరనందుకు సిద్ధమవుతున్నారు. తాను పోటీ నుండి తప్పుకొంటున్నట్లు ఆమె గురువారం రాత్రి ప్రకటించారు. ఆమెను గాని లేదా కడియం శ్రీహరిని గాని కాంగ్రెస్ తమ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉంది. శ్రీహరి అభ్యర్థి అయితే, కావ్యను స్టేషన్ ఘనపూర్ ఉపఎన్నికలో పోటీకి దింపే అవకాశం ఉంది.