రేవంత్ పక్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్‌ చేశారు

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో పలువురు మాజీ పోలీస్ అధికారులు అరెస్టు కాగా గురువారం మరో ఇద్దరు సీనియర్ అధికారులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా అరెస్ట్ అయిన వారిలో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డిసిపి రాధా కిషన్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ గట్టు మల్లు ఉన్నారు. కాగా ఇంకో కీలక అధికారిని అరెస్ట్ చేయనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ కేసులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. అయితే ఆ నేత ఎవరన్నది అధికారులు ఇంకా వెల్లడించలేదు. కాగా.. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహరంపై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప‌క్కన ఉన్నవాళ్లే ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డార‌ని జ‌డ్సన్ ఆరోపించారు. 
 
ఫోన్ ట్యాపింగ్ 4 లక్షల సిమ్‌ల కొనుగోళ్ల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఓఎస్డీ చంద్రశేఖర్ రెడ్డి, విద్యాసాగర్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు. సీపీ ఆఫీసుకు వెళ్లి 4 ల‌క్షల సిమ్‌ల వ్యవ‌హారం బ‌య‌ట‌పెట్టిన‌ త‌ర్వాత ఈ కేసు తమకే చుట్టుకునే అవ‌కాశం ఉంద‌ని అప్రమత్తం అయ్యారని చెప్పుకొచ్చారు.
 
తమకు విరుద్ధంగా మాట్లాడుతున్నాడని చెప్పి పార్టీకి 34 ఏళ్ల పాటు సుదీర్ఘ సేవలు అందించిన తనకు షోకాజ్ నోటీసులు జారీ చేశార‌ని జ‌డ్సన్ ఆవేద‌న వ్యక్తం చేశారు  తానేం పార్టీకి వ్యతిరేఖంగా మాట్లాడ‌లేదని జడ్సన్ చెప్పుకొచ్చారు. రాహుల్‌ గాంధీకి నరేంద్ర మోదీ శ‌త్రువని, కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంకు ఖాతాల‌న్నీ ఆయన సీజ్ చేపించారని గుర్తు చేశారు. 
 
ఎస్‌ఐబి కార్యాలయంతో పాటు ఇతర ప్రైవేటు ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ చేశారని ప్రధాన ఆరోపణలు వినిపిస్తుండగా, పోలీసులు ఆ కోణంలోనూ ద ర్యాప్తు చేస్తున్నారు. మాజీ టా స్క్‌ఫోర్స్ డిసిపి రాధాకిషన్‌రావు, సిఐ గట్టు మ ల్లును పోలీసులు విచారించారు. ట్యాపింగ్ వ్యవహారంలో మూలాలు కీలక ఫైల్స్ లభ్యమైనట్లు సమాచారం. ఓ మాజీమంత్రి తరచూ ఆయన ఇంటికి వచ్చి వెళ్తుండేవారని స్థానికులు పోలీసులకు వివరించారు. అరెస్టయిన అధికారుల ఆస్తులు, ఆదాయా లపై దృష్టి సారించింది.

ట్యాపింగ్ కోసం వినియోగించిన సామగ్రిని విదేశాల నుంచి కొనుగోలు చేశారని తేలడంతో, ఇందుకు సహకరించిన వారిపైనా పోలీసులు దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ పరికరాలని ఎక్కడ పెట్టారు? ఇతర ప్రైవేటు ప్రదేశాలలో ఏర్పాటు చేసి ట్యాపింగ్ చేశారా? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. ట్యాపింగ్ చేయాలని ఆదేశించిన రాజకీయ పెద్దలకు సైతం నోటీసులు ఇచ్చి విచారించేందుకు న్యాయ సలహా కోరతున్నట్లు సమాచారం. ఇజ్రాయెల్‌కు చెందిన అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి అమెరికాకు చెందిన నలుగురు సాఫ్ట్‌వేర్ టెకీలు నల్గొండ వార్‌రూంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని నడిపినట్లు తెలిసింది.

ఇలా ఉండగా, ఫోన్‌ట్యాపింగ్‌పై సిబిఐ విచారణ జరిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నామని బిజెపి ఎంపి, ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ తెలిపారు.  ఫోన్‌ట్యాంపిగ్‌కు మూలకారకులు బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్, బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ అని ఆరోపణలు చేశారు. ఫోన్‌ట్యాపింగ్ విషయంలో పాత్రదారులు కాదని, సూత్రదారులు బయటకు తీసుకరావాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసమే కెసిఆర్ ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.