సిరిసిల్ల నేతన్నల బకాయిలు రూ 270 కోట్లు చెల్లించండి

సిరిసిల్ల నేత కార్మికుల సమస్య పరిష్ కారానికి నేత కార్మికులకు రావాల్సిన రూ 270 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓ బహిరంగ లేఖలో బిజెపి ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆర్డర్లు ఇచ్చి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని, విద్యుత్ సబ్సిడీలను కొనసాగించాలని, ‘వర్కర్ టు ఓనర్’ పథకం అమలు చేయాలని ఆయన కోరారు.

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో నెలకొన్న సంక్షోభం వలన గత 4 నెలలుగా యజమానులు, నేత కార్మికులు ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి రావలసిన పాత బకాయిలు 270 కోట్ల రూపాయలు ఇంతవరకు చెల్లించలేదని, కొత్త ఆర్డర్లు ఇవ్వడం లేదని చెప్పారు. 

ఫలితంగా వస్త్ర పరిశ్రమపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి పని చేస్తున్న దాదాపు 20 వేల మంది పవర్ లూమ్ అనుబంధ రంగాల కార్మికులు పనుల్లేక పస్తులుంటున్నారని విచారం వ్యక్తం చేశారు. అప్పులు చేస్తూ ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.  ప్రభుత్వం బకాయిలు చెల్లించాలని, కొత్త ఆర్డర్లతో వస్త్ర పరిశ్రమను ఆదుకోవాలని గత 27 రోజులుగా చేనేత కార్మికులు సమ్మె చేస్తున్నా ప్రభుత్వం నుండి స్పందన లేదని ధ్వజమెత్తారు.

గత ప్రభుత్వం బతుకమ్మ చీరలు ప్రవేశపెట్టి ఖచ్చితంగా బతుకమ్మ చీరలను నేయాలంటూ ఆసాములను, యజమానులపై ఒత్తిడి చేసి పాత వ్యాపారాలను బంద్ చేయించిందని ఆయన గుర్తు చేసారు. అయితే, ఆ తరువాత మాస్టర్ వీవర్స్ పేరుతో పెద్ద యజమానులకు బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇచ్చి చిన్న యజమానులను, ఆసాములుగా కూలీలుగా మార్చిందని విమర్శించారు. 

బతుకమ్మ చీరలను ఉత్పత్తి చేసిన యజమానులకు సైతం ప్రభుత్వం నుండి సక్రమంగా చెల్లింపులు రాకపోవడంతో దాదాపు రూ.270 కోట్ల మేరకు బకాయిలు పేరుకుపోయాయని, దీంతో వ్యాపారాలు చేయడానికి డబ్బుల్లేక, కొత్త ఆర్డర్లు లేక యజమానులు వస్త్ర పరిశ్రమను బంద్ పెట్టారని తెలిపారు.

పవర్ లూం కార్ఖానాలకు గత 24 సంవత్సరాల నుండి 50 శాతం సబ్సిడీతో అందిస్తున్న విద్యుత్ ను నిలిపివేయడంతో రెట్టింపు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, ఆసాములు ఆ బిల్లులు చెల్లించలేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ చెప్పారు. దీంతో కోట్లాది రూపాయల విద్యుత్ బకాయిలు పేరుకుపోయాయని పేర్కొంటూ తక్షణమే విద్యుత్ బకాయిలను మాఫీ చేయడంతోపాటు విద్యుత్ సబ్సిడీని యథావిధిగా కొనసాగించాలని బండి సంజయ్ కోరారు. 
 
కార్మికులకు ఇవ్వాల్సిన 10 శాతం యార్న్ సబ్సిడీని వెంటనే అందించాలని కోరారు. నేత కార్మికుడిని ఆసామి చేయాలనే సంకల్పంతో గత ప్రభుత్వం రూ.370 కోట్ల వ్యయంతో ప్రవేశపెట్టిన ‘వర్కర్ టు ఓనర్’ పథకం అర్ధాంతరంగా నిలిచిపోయిందని పేర్కొంటూ ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించడంతోపాటు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను సంక్షోభం నుండి అధిగమించేలా అన్ని చర్యలు తీసుకోవాలని సంజయ్ విజ్ఞప్తి చేశారు.