ఈడీ విచారణకు మూడోసారీ మొయిత్రా డుమ్మా

విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ఉల్లంఘన కేసులో తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత మహువా మొయిత్రా మరోసారి ఈడీ విచారణను దాటవేశారు. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు మహువాకు సమన్లు జారీ చేయడంతో ఆమె గురువారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే, నేడు విచారణకు మహువా హాజరుకావడం లేదు. 
 
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కృష్ణానగర్‌ నుంచి పోటీ చేస్తున్న మహువా ఎన్నికలు పూర్తయ్యే వరకూ తనను పిలవొద్దని ఈడీ అధికారులను కోరినట్లు తెలిసింది.
కాగా, ప్రశ్నలకు ముడుపుల కేసులో ఇంతకుముందు రెండు సార్లు మహువాకు ఈడీ సమన్లు జారీ చేయగా ఆ రెండు సార్లూ ఆమె విచారణకు హాజరు కాలేదు. 
 
ఇదే కేసులో మహువా మొయిత్రాపై యాంటీ కరప్షన్‌ అంబుడ్స్‌మన్‌ లోక్‌పాల్‌ సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆరు నెలల్లోగా నివేదిక సమర్పించాలని స్పష్టంచేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న సీబీఐ గత శనివారం మహువా నివాసాల్లో, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది.  విచారణకు హాజరుకావాల్సిందిగా మహువాకు ఇటీవల సిబిఐ కూడా ఆదేశాలు జారీ చేసింది.
 
పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు నగదు తీసుకున్నారన్న ఆరోపణలపై శనివారం సిబిఐ ఆమె నివాసంలో సోదాలు జరిపింది. అవినీతి నిరోధక శాఖ లోక్‌పాల్‌ ఆమెపై బిజెపి ఎంపి నిషికాంత్‌ దూబే చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఫెడరల్‌ ఏజన్సీని ఆదేశించిన మరుసటి రోజు సిబిఐ ఆమె నివాసంలో సోదాలు చేపట్టడం గమనార్హం.
 
ఇంతలోనే ఈడీ ఆమెకు బుధవారం మూడోసారి సమన్లు పంపింది. గురువారం విచారణకు హాజరుకావాలంటూ నోటీసుల్లో పేర్కొంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త దర్శన్‌ హీరానందానికి కూడా సమన్లు పంపింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఎఫ్‌ఇఎంఎ) కింద గురువారం విచారించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. నాన్‌ రెసిడెంట్‌ ఎక్స్‌టర్నల్‌ (ఎన్‌ఆర్‌ఇ) కింద ఒకదేశం లోని ఖాతా నుండి మరో దేశంలోని ఖాతాకు నగదు చెల్లింపులు (ఫారిన్‌ రెమిటన్స్‌) జరిగినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
 
‘అనైతిక ప్రవర్తన’ ఆరోపణలతో గతేడాది డిసెంబర్‌లో లోక్‌సభ నుండి బహిష్కరణకు గురైన మహువాను టిఎంసి మరోసారి లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించింది. కృష్ణా నగర్‌ నియోజకవర్గం నుండి ఆమె ఎన్నికల బరిలోకి దిగారు