కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు

కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి చట్టం (పీఎంఎల్ఏ) కింద కేసు నమోదు చేసింది.  వీణాకు చెందిన ఐటీ కంపెనీ మ‌నీల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అక్ర‌మంగా చెల్లింపులు చేసిన‌ట్లు వీణాపై విమ‌ర్శ‌లు చెలరేగుతున్నాయి.

వీణా విజయన్ సంస్థకు ఒక మినరల్ కంపెనీ అక్రమంగా చెల్లింపులు జరిపిందంటూ ‘సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టికేషన్ ఆఫీస్’ చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈడీ ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది.   కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వీణాతోపాటు ఆమె సంస్థ, మరికొందరిపై ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది.

ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, కొచ్చికి చెందిన సంస్థ ‘కొచిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) అనే ప్రైవేటు సంస్థ 2017, 2018లో వీణా విజయన్‌కు చెందిన ఎక్సలాజిగ్ సొల్యూషన్ సంస్థకు రూ.1.72 కోట్లు చెల్లించింది. ఎలాంటి సర్వీసు తీసుకోకుండానే ఈ చెల్లింపులు జరిపిననట్టు ఈడీ వర్గాల ఆరోపణగా ఉంది.

ఒక ప్రముఖ వ్యక్తితో వీణా విజయన్‌కు సత్సంబంధాలున్నందునే ఎలాంటి సర్వీసు లేకుండానే ఎక్సలాజిక్‌కు సీఎంఆర్ఎల్ నెలవారీ చెల్లింపులను జరిపేదని చెబుతోంది. దీనికి ముందు, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ చేసిన దర్యాప్తుకు వ్యతిరేకంగా ఎక్సలాజిక్ కంపెనీ కర్ణాటక హైకోర్టుకు వెళ్లింది. అయితే, ఆ పిటిషన్‌ను కోర్టు గత నెలలో తోసిపుచ్చింది.

కాగా, గత జనవరిలో కేరళ అసెంబ్లీలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాట్లాడుతూ, తన భార్య రిటైర్‌మెంట్ ప్రయోజనాలతో తన కుమార్తె ఐటీ కంపెనీ పెట్టిందని, ఆమె పైన, తన కుటుంబం పైన చేస్తున్న ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. కొట్టాయం జిల్లా పంచాయత్ సభ్యుడు, సీనియర్ రాజకీయ నేత పిసి జార్జి కుమారుడు స్టోన్ జార్జి ఫిర్యాదు ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. పి.సి జార్జి ఇటీవలనే బీజేపీలో చేరారు.