బీజేపీలో చేరిన ఆప్ ఎంపీ సుశీల్ రింకూ

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు ఆప్‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ త‌గిలింది. ఆప్ ఎంపీ సుశీల్ కుమార్ రింకు బుధ‌వారం బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ ప్ర‌ధాన కార్యాల‌యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో రింకుతో పాటు జ‌లంధ‌ర్ వెస్ట్ ఎమ్మెల్యే శీత‌ల్ అంగుర‌ల్ కూడా కాషాయ పార్టీలో చేరారు. 2023లో జ‌రిగిన జ‌లంధ‌ర్ లోక్‌స‌భ ఉప ఎన్నిక‌ల్లో రింకు భారీ మెజారిటీతో ఘ‌న విజ‌యం సాధించారు.

రానున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో రింకు బీజేపీ త‌ర‌పున ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌నున్నారు. 543 మంది స‌భ్యులు క‌లిగిన లోక్‌స‌భ‌లో రింకు ఒక్క‌రే ఆప్ ఎంపీ కావ‌డం గ‌మ‌నార్హం. పంజాబ్ అభివృద్ధితో పాటు ముఖ్యంగా జ‌లంధ‌ర్ స‌ర్వ‌తోముఖాభివృద్ధి కోస‌మే తాను బీజేపీలో చేరాన‌ని రింకు చెప్పారు. ఆప్ ప్ర‌భుత్వం అభివృద్ధి ప్రాజెక్టుల‌ను చేప‌ట్ట‌డంలో నిర్ల‌క్ష్య వ‌హిస్తోంద‌ని ఆరోపించారు.

త‌న‌కు అధికార దాహం లేద‌ని, జ‌లంధ‌ర్ బాగు కోసం తాను కొత్త ప్ర‌యోగం చేస్తున్నాన‌ని చెప్పారు. ఇక లుథియానా ఎంపీ, కాంగ్రెస్ నేత ర‌వ‌నీత్ సింగ్ బిట్టు కూడా ఇటీవ‌ల బీజేపీలో చేరారు. బిట్టు పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ మ‌న‌వ‌డు కావ‌డం గ‌మ‌నార్హం. ఇక 13 లోక్‌స‌భ స్ధానాలు క‌లిగిన పంజాబ్‌లో జూన్ 1న తుది ద‌శలో అన్ని స్ధానాల‌కు పోలింగ్ జ‌రుగుతుంది. ఏడు ద‌శ‌ల పోలింగ్ అనంత‌రం జూన్ 4న ఓట్ల లెక్కింపు చేప‌ట్టి ఫ‌లితాలు ప్ర‌క‌టిస్తారు.