మాస్కో కోర్టు ముందు నేరాన్ని అంగీకరించిన ఉగ్రవాదులు

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రిజరిగిన  భారీ ఉగ్రదాడి ఘటనపై స్థానిక పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ దాడి ఘటనలో ఇప్పటి వరకూ 11 మందిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నారు. ఆ 11 మందిలో నలుగురు ఉగ్రవాదులు ఉన్నారు.  
 
ఆ నలుగురిలో ముగ్గురు ముష్కరులు తాజాగా నేరాన్ని అంగీకరించారు. దీంతో ఈ నలుగురినీ మే 22 వరకూ కస్టడీలోకి తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. 
తమ అదుపులో ఉన్న దలేర్డ్జోన్ మిర్జోయెవ్ (32), సైదాక్రమి రచబలిజోడా (30), ముఖమ్మద్సోబిర్ ఫైజోవ్ (19), షంసిదిన్ ఫరీదుని (25) ముష్కరుల్ని మాస్కోలోని బాస్మన్నీ జిల్లా కోర్టు ముందు పోలీసులు హాజరుపరిచారు.
 
వారిలో ముగ్గరు నేరాన్ని అంగీకరించారు. సంగీత కచేరీపై తుపాకులు, బాంబులతో విరుచుపడిన వారిలో తామూ ఉన్నామని కోర్టుకు వెల్లడించారు. కాగా, వీరిని ఆఫ్ఘానిస్థాన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఇస్లామిక్‌ స్టేట్‌-ఖొరాసన్‌ ఉగ్రముఠాకు చెందిన వారిగా అనుమానిస్తున్నారు.  ఈ నలుగురిలో ముగ్గురు కోర్టు ముందు నేరాన్ని అంగీకరించగా, ఒకరు మాత్రం మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు తెలిసింది.
అతడు విచారణ జరుగుతున్నంత సేపూ వీల్‌ఛైర్‌లో కళ్లు మూసుకొనే ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మిగిలిని ముగ్గురూ కూడా తీవ్ర గాయాలతో ఉన్నట్లు తెలిపింది. శుక్రవారం రాత్రి ప్రముఖ రష్యన్‌ రాక్‌ బ్యాండ్ ఫిక్‌నిక్‌ సంగీత కార్యక్రమం జరుగుతున్న క్రాకస్‌ సిటీ కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనకు తామే బాధ్యులమని ఐఎస్‌ఐఎస్‌ ప్రకటించింది. 

తొలుత కన్సర్ట్‌ హాల్‌లోకి ప్రవేశించిన దుండగులు అక్కడున్నవారిపై కాల్పులు జరిపి బీభత్సం సృష్టించారు. మ్యూజిక్‌ షో ముగియడంతో బయటకు వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కాల్పులు జరిపారు. అయితే ఏం జరుగుతుందో తెలియక అక్కన్నవారు సీట్ల మధ్య దాక్కున్నారు.  సమాచారం అందుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హాలులో చిక్కుకున్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ దాడి ఘటనలో 150 మంది  ప్రాణాలు కోల్పోగా.. వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.