ఫోన్ ట్యాపింగ్ లో ఇద్దరు అదనపు ఎస్పీల అరెస్ట్

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టు అయిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ కావడం రాష్ట్రంలో సంచలనంగా మారింది.  భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావు, హైదరాబాద్ నగర భద్రత విభాగం అదనపు డిసిపి తిరుపతన్నలను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు.  విచ్చలవిడిగా ఫోన్‌ట్యాపింగ్‌లకు పాల్పడిన వ్యవహారంలో ప్రణీత్‌తోపాటు వీరిద్దరి పాత్రను గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని అరెస్ట్‌ చేశారు.

రాజకీయ ప్రముఖుల, వ్యాపారుల ఫోన్లను ట్యాప్‌ చేయడంలో వీరిద్దరి ప్రమేయం గురించి కీలకాధారాలను సేకరించే పనిలో దర్యాప్తు బృందం నిమగ్నమైంది. భుజంగరావు ఎన్నికల ముందు వరకు పొలిటికల్‌ ఇంటెలిజెన్స్‌ విభాగంలో, తిరుపతన్న ఎస్‌ఐబీలో అదనపు ఎస్పీగా విధులు నిర్వర్తించారు. వీరిద్దరిని ఆదివారం కోర్టు ముందు హాజరుపరచగా, వీరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. దీంతో, పంజాగుట్ట పోలీసులు వీరిని చంచల్‌గూడా జైలుకు తరలిస్తున్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. 2019 ఎలక్షన్, మునుగోడు,హుజూరాబాద్ దుబ్బాక ఎలక్షన్ టైమ్ లో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు సమాచారం.  తాజా అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు అధికారులు. కరీంనగర్ జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రి ఫోన్‌ను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు తెలిసింది. ఉప ఎన్నిక సమయంలో బిఆర్‌ఎస్‌తో పోటీ పడుతున్న అభ్యర్థులు, వారి అనుచరుల ఫోన్లు ట్యాప్ చేసి, వారి సమాచారం తెలుసుకున్నట్లు తెలిసింది. ముఖ్యంగా వారు డబ్బులు తరలిస్తున్న విషయాలు తెలుసుకుని ముందుగానే పోలీసులు పట్టుకునే విధంగా చేసినట్లు తెలిసింది.

ప్ర ణీత్ రావుతో కలిసి ఇంటెలిజెన్స్‌లో పనిచేసిన స మయంలో భుజంగరావు ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు ప్రణీత్ చెప్పడంతో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ చే స్తున్న పోలీసులు ఇద్దరు ఎఎస్‌పిలు తిరుపతన్న, భుజంగరావును విచారణకు పిలిచారు. ఉదయం నుంచి ఇద్దరినీ విచారించిన అధికారులు, భుజంగరావును ఎనిమిది గంటల పాటు విచారించి, సాయంత్రం అరెస్టు చేసినట్లు బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. భుజంగరావు, ప్రణీత్ రావును ఎదురెదురుగా కూర్చోబెట్టి పోలీసులు విచారణ చేసినట్లు తెలిసింది. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఆయన కుటుంబీకుల ఫోన్లపై ప్రత్యక నిఘా ఉంచినట్లు విచారణ తెలింది. సిఎం రేవంత్ ఇంటికి కిలో మీటర్ పరిధిలో ఆఫీసు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి ట్యాపింగ్ కు పాల్పడినట్లు ఎన్నో సంచలన విషయాలు ప్రణీత్ రావు వాంగ్మూలంలో నమోదయ్యాయి.

ఈ కేసు తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న మాజీ పోలీసు అధికారుల ఇళ్లలో పోలీసులు శనివారం సోదాలు చేశారు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డిసిపి రాధాకిషన్‌రావు ఇళ్లతోపాటు పలువురు ఇళ్లల్లో సోదా లు నిర్వహించారు. భుజంగరావు, తిరుపతన్న ఇళ్లల్లో కూడా సోదాలు చేశారు. పంజాగుట్ట పోలీసులు ఏకకాలంలో 10 చోట్ల ఈ సోదాలు నిర్వహించారు. 

 పోలీసులు. ఓ న్యూస్ చానల్ ఎండి శ్రీధర్ రావు ఇంట్లో కూడా పోలీసులు నిర్వహించినట్టు సమాచారం. అయితే, శ్రవణ్‌రావు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ పోలీస్ అధికారులు ప్రభాకర్‌రావు, రాధాకిషన్‌రావు, ఐ న్యూస్ ఛానల్ అధినేత శ్రీధర్‌రావు విదేశాలకు పారిపోయినట్లు తెలిసింది. ప్రభాకర్‌రావు అమెరికాలో, శ్రీధర్‌రావు లండన్‌లో ఉన్నట్లు తెలిసింది.