లిక్కర్ కుంభకోణంలో కవిత మేనల్లుడు మేకా శరణ్!

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ  అధికారులు కొత్త పేరు బయటపెట్టారు. ఆయన ద్వారానే బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవిత లిక్కర్ స్కాంకు సంబంధించిన లావాదేవీలు జరిపారని, అతడే వచ్చిన డబ్బులను పెట్టుబడిగా పెట్టారని పేర్కొన్నారు. కవిత మేనల్లుడు మేకా శరణ్ లిక్కర్ స్కాంలో కీలక వ్యక్తి అని ఇడి అధికారులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 

శరణ్‌ను విచారణకు రావాల్సిందిగా ఎన్నిసార్లు నోటీసులు పంపించినా హాజరు కావడం లేదని, కవితను విచారిస్తే అతడి గురించి తనకు తెలియదని చెబుతున్నారని  ఈడీ అధికారులు కోర్టుకు తెలిపారు. దీంతో సౌత్ గ్రూప్ లాబీ డబ్బుల లావాదేవీల్లో శరణ్‌దే కీలక పాత్రగా ఉన్నట్లు ఇడి అధికారులు భావిస్తున్నారు.

కవిత మేనల్లుడు శరణ్ ద్వారా లావాదేవీలు జరిగినట్లు  ఈడీ  అనుమానం వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో కవిత ఇంట్లో ఇడి చేసిన సోదాల్లో శరణ్ మొబైల్ లభ్యమైంది. దాని ద్వారా శరణ్‌ను విచారణ చేయాలని ఇడి భావిస్తుండగా అతడు అందుబాటులోకి రావడంలేదు. 

దీంతో ఈడీ అధికారులు కవిత ఆడపడుచు అఖిల, మేనల్లుడు శరణ్ ఇంట్లో శనివారం ఉదయం నుంచి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో లిక్కర్ స్కాంకు సంబంధించిన కీలక ఆధారాలు సేకరించినట్లు తెలిసింది. శనివారం ఉదయం 6:30 గంటలకే హైదరాబాద్ వచ్చిన ఈడి అధికారులు కవిత ఆడపడుచు నివాసంలో తనిఖీలు చేపట్టారు. 

మొత్తం ఏడుగురు  ఈడీ  అధికారుల బృందం ఈ సోదాలు చేసింది. కవిత అరెస్ట్ అనంతరం ఇలా సోదాలు జరుగుతుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈడీ  కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఐటి రిటర్న్ అడుగుతున్నారని కస్టడీలో ఉన్నప్పుడు డాక్యుమెంట్ వివరాలు ఎలా ఇస్తారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. 

బెయిల్ పిటిషన్ వేశామని, బెయిల్ పిటిషన్‌పై ఇడికి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే బెయిల్ పిటిషన్‌ను ఇడి తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదని పేర్కొంది. `దర్యాప్తులో తేలిన విషయాలపై కవితను ప్రశ్నించాం. ఈడీ  విచారణలో కవిత మొబైల్ డేటాను పరిశీలించాం. డేటా డిలీట్ చేశారని గుర్తించాం. కుటుంబ వ్యాపార వివరాలు, ఆర్థిక అంశాల పత్రాలు వివరాలు ఇవ్వాలని కోరాం. కవితను కుటుంబ సభ్యులు, న్యాయవాది కలిసే సమయంలో డాక్యుమెంట్స్ వివరాలను తెలియజేస్తానని చెప్పారు. ఇప్పటివరకు ఎలాంటి డాక్యుమెంట్లు అందించలేదు’ అని రిపోర్టులో ఈడీ  పేర్కొంది.

‘కవిత నుంచి మరింత సమాచారాన్ని సేకరించాలని, లిక్కర్ కేసులో మేకా శరణ్ పాల్గొన్నట్లు వెల్లడైంది. కేసులో దర్యాప్తునకు సంబంధించిన సమాచారం శరణ్ దగ్గరుంది. కవిత మాత్రం శరణ్ ఎవరో తెలియదని చెబుతున్నారు. మేకా శరణ్ విషయంలో దర్యాప్తునకు సహకరించడం లేదు. ఇందులో భాగంగా ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నాం. నలుగురు నుంచి వాంగ్మూలాలు తీసుకున్నాం’ అంటూ వివరించింది.

మరోవంక, కస్టడీలో ఉన్న కవిత నుంచి ఈడీ  అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సమాచారంతోనే మరోసారి ఈడీ  రంగంలోకి దిగిందని సమాచారం. ఉదయం నుంచి జరిగిన సోదాల్లో కీలక పత్రాలు, సమాచారం రాబట్టినట్లు తెలిసింది.  కవిత, ఆమె భర్త అనిల్ కుమార్ బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలించగా, ఆడపడుచు అఖిల విషయం బయటికొచ్చిందని, అందుకే ఈ సోదాలని తెలిసింది. కవిత తర్వాత ఇదే కేసులో మరికొందరిని అరెస్టు చేయవచ్చని, మళ్లీ కొందరి ఇళ్లల్లో సోదాలు చేయవచ్చని తెలిసింది.