బీజేపీలో చేరిన మాజీ గవర్నర్ తమిళసై

తెలంగాణ మాజీ గవర్నర్ డా. తమిళసై సౌందరాజన్ బుధవారం తమిళనాడులో  బీజేపీలో చేరారు. తమిళనాడు నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్న తమిళసై సోమవారం పదవికి రాజీనామా చేశారు. తమిళసై రాజీనామాను రాష్ట్రపతి అదే రోజు ఆమోదించారు. చెన్నైలోని బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయం ‘కమలాలయం’లో సౌందరరాజన్‌కు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై సభ్యత్వ కార్డును అందజేశారు.
ఈ సందర్భంగా తమిళిసై సౌందరరాజన్ మీడియాతో మాట్లాడుతూ పదవి నుంచి వైదొలగడం కఠినమైన నిర్ణయమే అయినప్పటికీ తిరిగి పార్టీ కోసం పనిచేయడం సంతోషంగా ఉందని చెప్పారు. గతంలో ‘వానతి శ్రీనివాసన్ పార్టీ కార్యాలయంలో కూర్చునేవారని, రాజకీయాల్లో విజయవంతమైన మహిళకు ఆమె ఒక ఉదాహరణ అని ఆమె  చెప్పారు. తనకు ఇది అత్యంత సంతోషకరమైన రోజు అని తెలిపారు. 
గవర్నర్‌గా  ఎన్నో సౌకర్యాలు ఉండేవని, గవర్నర్ పదవిని వదులకుని, రాజకీయాల్లోకి వచ్చినందుకు తాను  ఒక్క శాతం కూడా చింతించడం లేదని చెప్పారు. గవర్నర్‌గా పనిచేసిన సమయంలో  తెలంగాణలో ఎన్నో సవాళ్లను చూశానని,  తాను గవర్నర్‌గా పనిచేసిన సమయంలో నలుగురు ముఖ్యమంత్రులను చూశానని ఆమె చెప్పారు. తమిళనాడులో కమలం వికసించటం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. 

తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె.అన్నామలై మాట్లాడుతూ రాష్ట్రానికి తన వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే తమిళిసై తన పదవికి రాజీనామా చేశారని చెప్పారు. తమిళసై తీసుకున్న నిర్ణయం అంత సులువైనది కాదని చెబుతూ ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకోబోతోందని, తమిళిసై రాజకీయాల్లో ఉండి బీజేపీకి సహకరించాలని అనుకుంటున్నారని చెప్పారు.

గవర్నర్‌ పదవికి రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించడంతో ఆమె మళ్లీ బీజేపీ క్యాడర్ లో చేరారని చెప్పారు. తమిళ ప్రజలను, బీజేపీ పార్టీని ఎంతగా ప్రేమిస్తుందో దీన్ని బట్టి అర్థం అవుతోందని చెప్పారు. పొత్తులు, సీట్ల పంపకాల కోసం ఐదు రోజులుగా చెన్నైలోనే ఉన్న కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ఆమెకు కమలం కండువా కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. తమిళసైకు ఎంతో పరిపాలనా అనుభవం ఉందని చెప్పారు. ఆమెను తిరిగి తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కేంద్ర మంత్రి చెప్పారు.

కాగా, దాదాపు 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో చురుకుగా ఉన్న తమిళిసై.. బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. 2019 పార్లమెంట్‌ ఎన్నికల్లో దక్షిణ చెన్నై పార్లమెంట్‌ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమెను కేంద్రం తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. 

2019 సెప్టెంబర్‌ 8న తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నియమితులయ్యారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా కూడా అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రత్యక్ష రాజకీయాలంటే ఇష్టమున్న ఆమె.. లోక్‌సభ ఎన్నికలకు ముందు గవర్నర్‌ పదవికి రాజీనామా చేశారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆమె తిరిగి బీజేపీలో చేరారు. త‌మిళ‌నాడులోని చెన్నై సెంట్రల్ లేదా తూత్తుకుడి ఎంపీ స్థానం నుంచి త‌మిళిసై పోటీ చేసే అవ‌కాశం ఉన్నట్లు తెలుస్తోంది.