అఫ్గాన్‌పై అర్ధరాత్రి పాక్‌ వైమానిక దాడులు

* 8 మంది దుర్మరణం, పలు నివాసాలు ధ్వంసం

అఫ్గానిస్థాన్‌పై అర్ధరాత్రి పాకిస్థాన్ సైన్యం వైమానిక దాడులకు పాల్పడింది. అఫ్గానిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లోగల బర్మాల్‌ జిల్లాలో, ఖోస్ట్‌ ప్రావిన్స్‌లోగల సెపెరా జిల్లాలోని అఫ్గాన్‌ దుబాయ్‌ ఏరియాలో ఈ వైమానిక దాడులు జరిగాయి. సాధారణ పౌర నివాసాలే లక్ష్యంగా పాకిస్థాన్‌ ఈ వైమానిక దాడులకు పాల్పడింది.
 
పాకిస్తాన్ సోమవారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ఆఫ్ఘనిస్తాన్ లోపల జరిపిన వైమానిక దాడులలో ముగ్గురు పిల్లలతో సహా ఎనిమిది మంది పౌరులు మరణించినట్లు ఆఫ్ఘన్ తాలిబన్ వెల్లడించింది. కల్లోలిత పాకిస్తానీ నగరాలలో ఇటీవలి తీవ్రవాద డాడుల పరంపరకు ఉభయ దేశాల మధ్య వాగ్యుద్ధం సాగుతున్న నేపథ్యంలో ఈ వైమానిక దాడులు జరిగాయి. 
 
పాకిస్తాన్ సరిహద్దు పొడుగునా ఆఫ్ఘనిస్తాన్‌లోని పక్తికా, ఖోస్త్ ప్రావిన్స్‌లలో ఈదాడులు జరిగాయని ఆఫ్ఘన్ మధ్యంతర ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు ధ్రువీకరించారు. దీనిపై పాకిస్తాన్ నుంచి వెంటనే ఎటువంటి ప్రతిస్పందనా రాలేదు. పాకిస్తానీ విమానాలు ఈ దాడులు సాగించాయని ఆఫ్ఘన్ పాలకుల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఒక ప్రకటనలో ఆరోపించినట్లు ‘డాన్’ పత్రిక కాబూల్ నుంచి తెలియజేసింది.
 
 పాకిస్తాన్ సరిహద్దు సమీపంలోని ఖోస్త్, పక్తికా ప్రావిన్స్‌లలో పౌరుల ఇళ్లపై పాకిస్తాన్ విమానాలు తెల్లవారు జామున సుమారు 3 గంటలకు బాంబు దాడులు సాగించాయని ఆఫ్ఘన్ మధ్యంతర ప్రభుత్వ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఆరోపించారు. పాకిస్తానీ విమానాలు పక్తికా బర్మల్ జిల్లాలోని లామన్ ప్రాంతంలో బాంబులు వేశాయని ముజాహిద్ తెలియజేశారు.
 
‘సామాన్య ప్రజల ఇళ్లను లక్షం చేసుకున్నారు’ అని ఆయన ఆరోపిస్తూ, పక్తికాలో ముగ్గురు మహిళలు, ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు, ఒక ఇల్లు కూలిపోయినట్లు, ఖోస్త్‌లో ఇద్దరు మహిళలు మరణించినట్లు, ఒక ఇల్లు ధ్వంసం అయినట్లు వివరించారు. 
 
తమ సమస్యలకు, హింసాత్మక సంఘటనల కట్టడిలో వైఫల్యానికి ఆఫ్ఘనిస్తాన్‌ను నిందించడం మానాలని పాకిస్తాన్‌ను ఆ ప్రతినిధి కోరారు. ఉత్తర వజీరిస్తాన్‌లో భద్రత బలగాల పోస్ట్‌పై ఉగ్ర దాడిలో ఏడుగురు సైనికుల మరణం తరువాత ప్రతీకార చర్యలు తప్పవని పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హెచ్చరించిన మరునాడు ఈ వైమానిక దాడులు చోటు చేసుకున్నాయి. కాగా ఈ దాడులను ఇస్లామిక్‌ ఎమిరేట్స్‌ ఆఫ్‌ అఫ్గానిస్థాన్‌ తీవ్రంగా ఖండించింది.