ఇజ్రాయిల్‌ చేతిలో బందీలుగా 40 మంది జర్నలిస్టులు

సుమారు 40 మంది పాలస్తీనా జర్నలిస్టులు ఇజ్రాయిల్‌ చేతిలో బందీలుగా ఉన్నారు.  ఆక్రమిత వెస్ట్‌జోన్‌ నుండి గతేడాది అక్టోబర్‌లో ఏకపక్షంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.   వీరిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.  40 మందిలో 23 మంది రిపోర్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు.  

వారిపై ఎటువంటి విచారణ లేదా అభియోగాలు నమోదు కాలేదని, ఇప్పటికీ బందీలుగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఖైదీల వ్యవహారాల కమిటీ,  పాలస్తీనియన్‌ ఖైదీల సొసైటీ నివేదిక ప్రకారం.. గతేడాది అక్టోబర్‌ 7 నాటికి 61 మంది జర్నలిస్టులను ఇజ్రాయిల్ బందించింది.  అనంతరం   వీరిలో 21 మంది విడుదలయ్యారు.

సోమవారం తెల్లవారుజామున గాజాస్ట్రిప్‌లోని అతిపెద్ద ఆస్పత్రి షిఫాపై ఇజ్రాయిల్‌ దళాలు దాడికి దిగాయి. హమాస్‌ మిలిటెంట్లు అక్కడ ఉన్నారని, కాంపౌండ్‌ లోపల నుండి కాల్పులు చేపట్టారని ఆరోపించాయి. ఆ ఆస్పత్రిలో సుమారు పదివేల మంది ప్రజలు ఆశ్రయం పొందుతున్నారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు. 

 
సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ దళాలు ట్యాంకులు, ఫిరంగులతో మెడికల్‌ కాంప్లెక్స్‌ను చుట్టుముట్టాయని, లోపల ఉన్న వారిపై కాల్పులు జరిపాయని ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న వ్యక్తులు తెలిపారు. భవనాలపై దాడి చేయడంతో పాటు డజన్ల కొద్దీ పౌరులను అదుపులోకి తీసుకున్నాయని చెప్పారు.
 
తాము లోపల చిక్కుకుపోయామని మూడు నెలలుగా ఈ ఆస్పత్రిలో ఆశ్రయం పొందుతున్న అబ్దుల్‌ హదీ సయ్యద్‌ తెలిపారు. కదిలితే ఇజ్రాయిల్‌ దళాలు కాల్పులు జరుపుతున్నాయని, దీంతో వైద్యులు ఎక్కడికక్కడ నిలిచిపోయారని, అంబులెన్స్‌ సేవలు ఆగిపోయాయని చెప్పారు. అయితే, ఆస్పత్రిలోని కొన్ని భవనాలపై సైన్యం ”నిర్దిష్టమైన ఆపరేషన్‌” ప్రారంభించిందని, ఇక్కడ కొందరు హమాస్‌ మిలిటెంట్లు ఉన్నారని ఇజ్రాయిల్‌ చీఫ్‌ మిలటరీ ప్రతినిధి డేనియల్‌ హగారీ తెలిపారు. తమ బలగాలు సుమారు 80 మందిని అదుపులోకి తీసుకున్నాయని తెలిపారు.

గతేడాది అక్టోబర్‌ 7 నుండి ఇజ్రాయిల్‌ పాలస్తీనాపై క్రూరమైన దాడులు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఇజ్రాయిల్‌ దాడుల్లో 31,819 మంది పాలస్తీనియన్లు మరణించగా, లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. ఇజ్రాయిల్‌ దాడులను అంతర్జాతీయ సమాజం ఖండిస్తోంది. కాల్పుల విరమణ ప్రకటించాలని డిమాండ్‌ చేస్తోంది.