నేను గెలవకుంటే రక్తపాతమే.. డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీచేస్తోన్న డొనాల్డ్ ట్రంప్  ఓహియోలో ఎన్నికల ప్రచారంలో  పాల్గొంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వచ్చే నవంబరు అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలో ఎంతో ముఖ్యమైనవని, దేశగతిని మార్చేవని చెబుతూ రిపబ్లికన్ నామినీగా తన స్థానాన్ని దక్కించుకున్న మాజీ అధ్యక్షుడు తనను ఎన్నుకోకపోతే ‘రక్తపాతం’ తప్పదని హెచ్చరించాడు. ‘నవంబరు 5 ఈ తేదీని గుర్తుంచుకోండి.. మన దేశ చరిత్రలో అత్యంత ముఖ్యమైన తేదీ అని నేను నమ్ముతున్నాను’ అని పేర్కొన్నారు.
 
తన విమర్శలను పునరావృతం చేసిన ట్రంప్ జో బైడెన్‌ను ‘చెత్త’ అధ్యక్షుడని విమర్శించారు.  మెక్సికోలో కార్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్న చైనా నిర్ణయాన్ని ట్రంప్ తీవ్రంగా వ్యతిరేకించారు. తాను అధికారం లోకి వస్తే అక్కడ ఉత్పత్తయ్యే కార్లను అమెరికాలో విక్రయించడానికి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. 100 శాతబైం దిగుమతి సుంకాలు విధిస్తామని చెప్పారు. పరోక్షంగా బైడెన్ వాహన పరిశ్రమ విధానాలను లక్షంగా చేసుకొని ఈ వ్యాఖ్యలు చేశారు.
 
‘ఇప్పుడు నేను ఎన్నిక కాకపోతే అది మొత్తానికి రక్తపాతం అవుతుంది.. అది తక్కువ అవుతుంది. కానీ నేను ఆ కార్లను అమ్మబోనీయను’ అని ట్రంప్ ధ్వజమెత్తారు. ట్రంప్ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఆయన ఎన్నికల ప్రచార బృందం అధికార ప్రతినిధి కారోలిన్ లీవిట్ వివరణ ఇచ్చారు.

బైడెన్ విధానాల వల్ల అమెరికా వాహన పరిశ్రమలో ‘ఆర్థిక రక్తపాతం’ మొదలవుతుందనే కోణంలోఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు వివరించారు.
 
ట్రంప్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేగుతోంది. రాజకీయ హింసకు సంబంధించిన బెదిరింపులకు పాల్పడుతున్నాడని దుయ్యబడుతున్నారు. ‘అతను మరో జనవరి 6ని కోరుకుంటున్నాడు.. అయితే అమెరికన్ ప్రజలు ఈ నవంబర్‌లో అతనికి మరో ఎన్నికల ఓటమిని ఇవ్వబోతున్నారు.. ఎందుకంటే వారు అతని తీవ్రవాదాన్ని, హింస పట్ల అతని ప్రేమను, ప్రతీకార దాహాన్ని తిరస్కరిస్తూనే ఉన్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 2021లో ట్రంప్ మద్దతుదారులు అమెరికా క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే.

ట్రంప్ వ్యాఖ్యలపై అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. మాజీ అధ్యక్షుడి హింసను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తున్నాడని మండిపడ్డారు. ‘స్వాతంత్ర్యం దాడికి గురవుతోంది… 2020 ఎన్నికల గురించి అబద్ధాలు, దానిని తారుమారు చేయడానికి, జనవరి 6న దాడికి ఉసిగొల్పడం.. అమెరికా అంతర్యుద్ధం తర్వాత మన ప్రజాస్వామ్యానికి గొప్ప ముప్పుగా పరిణమించింది.. 2020లో విఫలమయ్యాడు కానీ … ముప్పు అలాగే ఉంది.’ అని బైడెన్ హెచ్చరించారు.