ఈడీ విచారణకు కేజ్రీవాల్‌ మరోసారి డుమ్మా

ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ సమన్లను పట్టించుకోలేదు. ఢిల్లీ జల్‌ బోర్డ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ ఎదుట హాజరయ్యేందుకు ఆయన నిరాకరించారు. ఈ మేరకు ఆమ్‌ ఆద్మీ పార్టీ సోమవారం ప్రకటించింది.  ఈడీ సమన్లు చట్టవిరుద్ధమని, విచారణకు ఆప్‌ అధినేత హాజరు కాబోరని స్పష్టం చేసింది. 
కాగా, ఢిల్లీ జల మండలి (డీజేబీ) కేసులో తొలిసారి కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. డీజేబీ కేసులో ఈనెల 18న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది.  అదేవిధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా ఆదివారం తొమ్మిదోసారి సమన్లు పంపింది. ఈ కేసులో ఈనెల 21న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. అయితే, డీజేబీ కేసులో ఇవాళ ఈడీ ఎదుట కేజ్రీవాల్‌ హాజరుకారని ఆప్‌ సోమవారం ఉదయం ప్రకటించింది. 
 
ఇక లిక్కర్‌ స్కామ్‌కు సంబంధించి ఈడీ సమన్లకు స్పందించని కేసులో కోర్టు కేజ్రీవాల్‌కు ఇప్పటికే బెయిల్‌ ఇచ్చిందని, అయినా ఈడీ మళ్లీ ఎందుకు సమన్లు పంపిందో తెలియడం లేదని ఆప్‌ నేతలు వ్యాఖ్యానించారు. కేజ్రీవాల్‌కు ఈడీ పంపిన సమన్లు చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.కాగా, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్పటికే ఎనిమిదిసార్లు సమన్లు పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ సమన్లకు ఆయన స్పందిచకపోవడంతో ఢిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్‌ కోర్టు ముందు హాజరయ్యారు. చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ ఆయనకు బెయిల్‌ మంజూరు చేశారు. అయితే ఆ మరుసటి రోజే కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు పంపింది.

ఇప్పటివరకు ఈడీ విచారణకు వెళ్తే తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే అనుమానంతోనే కేజ్రీవాల్ వెళ్లనట్లు తెలుస్తోంది. తాజాగా ఆయనకు కోర్టు బెయిల్ ఇవ్వడంతో.. ఈసారి విచారణకు హాజరయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కోర్టు కేవలం బెయిల్ మాత్రమే మంజూరు చేసింది. విచారణకు ఆయనను పిలవొద్దని ఈడీకి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు. దీంతో తొమ్మిదోసారి ఈడీ సమన్లపై కేజ్రీవాల్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది.